
బజరంగ్ పూనియా
బుడాపెస్ట్ (హంగేరి): ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు గెలిచిన భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ మెరిశాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో ఈ హరియాణా రెజ్లర్ స్వర్ణ–రజత పతక పోరుకు అర్హత సాధించి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. తద్వారా ఈ మెగా ఈవెంట్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ రెజ్లర్‌గా కొత్త చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు 2013 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బజరంగ్ 60 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించాడు.
ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న బజరంగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరిగా బరిలోకి దిగాడు. తనపై పెట్టుకున్న అంచనాలకు అనుగుణంగా రాణించి ఒక్కో ప్రత్యర్థిని ఓడిస్తూ అంతిమ సమరానికి అర్హత పొందాడు. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో బజరంగ్ 4–3తో అలెజాండ్రో ఎన్రిక్ వాల్డెస్ (క్యూబా)ను ఓడించాడు. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో బజరంగ్ 5–3తో తుల్గా తుముర్ (మంగోలియా)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 4–0 తో సెయుంగ్‌చుల్ లీ (దక్షిణ కొరియా)పై, తొలి రౌండ్‌లో 9–4తో రోమన్ అశారిన్ (హంగేరి)పై నెగ్గాడు. ఆదివారమే జరిగిన ఇతర విభాగాల్లో భారత రెజ్లర్లు నిరాశ పరిచారు. సందీప్ తోమర్ (57 కేజీలు), దీపక్ (92 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో... సచిన్ రాఠి (79 కేజీలు) తొలి రౌండ్‌లో ఓడిపోయారు.
నేడు జరిగే ఫైనల్లో టకుటో ఒటోగురో (జపాన్)తో బజరంగ్ తలపడతాడు. ఒకవేళ బజరంగ్ గెలిస్తే భారత్ తరఫున ప్రపంచ చాంపియన్ అయిన రెండో రెజ్లర్‌గా గుర్తింపు పొందుతాడు. ఇప్పటివరకు భారత్ తరఫున సుశీల్ కుమార్ (66 కేజీలు; 2010లో) ఒక్కడే విశ్వవిజేతగా నిలిచాడు. గతంలో భారత్ తరఫున అమిత్ (55 కేజీలు; 2013లో), బిషంబర్ (57 కేజీలు; 1967లో) రజతాలు... రమేశ్ (74 కేజీలు; 2009లో), నర్సింగ్ యాదవ్ (74 కేజీలు; 2015లో), సందీప్ (66 కేజీలు, 2013లో) కాంస్య పతకాలు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment