రేప్ కేసులో వరల్డ్ కప్ క్రికెటర్ అరెస్ట్
బంగ్లాదేశ్ తరఫున ప్రపంచకప్కు ఎంపికైన రూబెల్ హొస్సేన్ అనే క్రికెటర్ను అత్యాచారం కేసులో రిమాండుకు పంపారు. ఓ నటి మీద అత్యాచారం చేశాడన్న ఆరోపణలతో అతడిని అరెస్టు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, తనపై అత్యాచారం చేశాడంటూ 19 ఏళ్ల హీరోయిన్ ఒకామె ఫిర్యాదు చేయడంతో ఢాకా మేజిస్ట్రేట్ రూబెల్ను రిమాండుకు పంపాల్సిందిగా ఆదేశించారు. దీంతో.. వచ్చే నెలలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో జరిగే ప్రపంచకప్ పోటీల్లో అతడు పాల్గొంటాడా లేదా అన్నవిషయం అనుమానంలో పడింది
రూబెల్ పెట్టుకున్న బెయిల్ దరఖాస్తును మేజిస్ట్రేట్ తిరస్కరించారని, దాంతో కేసు తదుపరి విచారణకు వచ్చే వరకు అతడిని జైలుకు పంపారని ఢాకా పోలీసు డిప్యూటీ కమిషనర్ అనిసుర్ రెహ్మాన్ తెలిపారు. అయితే.. తదుపరి విచారణ ఎప్పుడన్న విషయం మాత్రం ఇంకా వెల్లడించలేదు. అత్యాచారం ఫిర్యాదులు రావడంతో ఇప్పుడు బాధితురాలికి, రూబెల్కు కూడా డీఎన్ఏ పరీక్షలు చేయించాలని కోర్టు ఆదేశించింది. అయితే.. ఇవన్నీ నిరాధార ఆరోపణలని ఫాస్ట్ బౌలర్ అయిన రూబెల్ చెబుతున్నాడు. ఆమె తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆరోపించాడు.