ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్లు సోమవారం సమ్మెకు దిగారు. తమ డిమాండ్లు పరిష్కరించేంతవరకు క్రికెట్ ఆడమని అదేవిధంగా క్రికెట్ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)కి తేల్చిచెప్పారు. అంతేకాకుండా బీసీబీకి గతంలోనే 11 డిమాండ్లతో కూడిన లేఖను పంపామని.. కానీ పట్టించుకోకపోవడంతోనే సమ్మెకు దిగినట్లు క్రికెటర్లు తెలిపారు. మైదాన సిబ్బంది, ఆటగాళ్ల జీతాలు పెంచడం, ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ ఫీజు పెంచడం, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో మార్పులు, ప్రయాణ ఖర్చుల పెంపు వంటి డిమాండ్లతో సమ్మెకు దిగినట్లు క్రికెటర్లు పేర్కొంటున్నారు. సుమారు 50 మంది క్రికెటర్లు ఈ సమ్మెలో పాల్గొన్నట్లు సమాచారం. సమ్మెలో పాల్గొన్న క్రికెటర్లకు షకీబుల్ హసన్, ముష్పీకర్ రహీమ్‌లు నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో భారత్-బంగ్లాదేశ్ సిరీస్ జరిగేది అనుమానంగా మారింది. టీమిండియాతో బంగ్లా మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. నవంబర్ 3న తొలి టి20 జరగాల్సి ఉంది. అయితే బంగ్లా క్రికెటర్లు సమ్మెకు దిగడంతో ఈ సిరీస్ ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇది బీసీబీకి చెందిన అంతర్గత విషయమని, దానిపై స్పందించాల్సిన అవసరం లేదని బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న సౌరవ్ గంగూలీ పేర్కొన్నారు. బంగ్లా- టీమిండియా సిరీస్ తప్పక జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా బీసీబీ నుంచి అధికారిక సమాచారం వచ్చేంత వరకు దీనిపై స్పందించకుండా ఉంటేనే ఉత్తమమని గంగూలీ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment