
ఈ ఏడాది డిసెంబర్‌లో బంగ్లాదేశ్ పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా.. అతిథ్య బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. భారత పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ గురువారం ప్రకటించింది. డిసెంబర్ 4న ఢాకా వేదికగా జరగనున్న తొలి వన్డేతో భారత్ టూర్ ప్రారంభం కానుంది.
ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు కూడా ఢాకా వేదికగానే జరగనున్నాయి. అనంతరం డిసెంబర్ 14 చటోగ్రామ్ వేదికగా తొలి టెస్టు.. డిసెంబర్ 22 ఢాకాలో రెండో టెస్టు జరగనుంది. కాగా భారత జట్టు దాదాపు ఏడేళ్ల తర్వాత బంగ్లాదేశ్‌కు టూర్‌కు వెళ్లనుండడం గమనార్హం. టీమిండియా చివరిసారిగా 2015లో బంగ్లా పర్యటనకు వెళ్లింది. మరోవైపు బంగ్లాదేశ్ పర్యటకు భారత్ జట్టు రానుండడం తమకు ఎంతో సంతోషంగా ఉంది అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ అన్నారు.
"బంగ్లాదేశ్- భారత్ మధ్య మరో చిరస్మరణీయమైన సిరీస్ కోసం ఇరు దేశాల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేము షెడ్యూల్‌ను ఫిక్స్ చేయడంలో మా క్రికెట్ బోర్డుకు సహకరించినందుకు బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి)కి ధన్యవాదాలు. బంగ్లాదేశ్‌కు వచ్చే భారత జట్టును స్వాగతించేందుకు ఎదురుచూస్తున్నాం’’ అని బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్ పేర్కొన్నారు.
చదవండి: T20 World Cup 2022: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. మెల్‌బోర్న్‌కు చేరుకున్న టీమిండియా