విజయం దిశగా టీమిండియా
హైదరాబాద్:బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ లో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. ఆఖరి రోజు ఆటలో భారత్ విజయానికి ఇంకా మూడు వికెట్లు అవసరం కాగా. బంగ్లాదేశ్ మాత్రం డ్రా కోసం పోరాడుతుంది. భారత్ విసిరిన 459 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 225 పరుగుల వద్ద ఏడో వికెట్ ను నష్టపోయింది. బంగ్లా ఆటగాడు మొహ్ముదుల్లా(64) ఏడో వికెట్ గా పెవిలియన్ చేరాడు.
అంతకుముందు 103/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ మూడు పరుగుల వ్యవధిలో ఓవర్ నైట్ ఆటగాడు షకిబుల్ హసన్(21) వికెట్ ను నష్టపోయింది. ఆ తరువాత కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్- మొహ్మదుల్లా జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది.ఈ జోడి 56 పరుగులు జోడించిన పిదప ముష్ఫికర్(23) అవుట్ కాగా, బంగ్లా ఆటగాడు షబ్బిర్ రెహ్మాన్(22) ఆరో వికెట్ గా పెవిలియన్ చేరాడు. బంగ్లాదేశ్ కోల్పోయిన ఏడు వికెట్లలో అశ్విన్ మూడు వికెట్లు సాధించగా, జడేజా ,ఇషాంత్ శర్మలకు తలో రెండు వికెట్లు దక్కాయి.