టెస్టుల్లో భారత జట్టు తాజా ఫామ్ చూస్తే ఎలాంటి ప్రత్యర్థికైనా వణుకు పుడుతుంది. సొంత గడ్డపై అయితే టీమిండియా తిరుగులేని ఆటతో దూసుకుపోతోంది. 2013 నుంచి ఇప్పటి వరకు 32 టెస్టులు ఆడితే భారత్ ఏకంగా 26 గెలిచి, 1 మ్యాచ్‌లో మాత్రమే ఓడింది. మిగిలిన ఐదు మ్యాచ్‌లు ‘డ్రా’ కావడం ప్రత్యర్థి జట్లు చేసుకున్న అదృష్టం మాత్రమే.
కోహ్లి సేన ఎంత నిర్దాక్షిణ్యంగా ఆడుతోందో దక్షిణాఫ్రికాతో ఇటీవల జరిగిన సిరీస్ మళ్లీ చూపించింది. ఈ నేపథ్యంలో టెస్టుల్లో పసికూనలాంటి బంగ్లాదేశ్‌తో స్వదేశంలో మరో సిరీస్‌కు మన జట్టు సన్నద్ధమైంది. భారత గడ్డపై ఒకే ఒక్క టెస్టు ఆడి చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్... ఈసారి అంతకంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వగలిగినా గొప్పే!
ఇండోర్: ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా ఇప్పటి వరకు ఆడిన ఐదు టెస్టులూ నెగ్గి 240 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు మరిన్ని పాయింట్లు తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో స్వదేశంలో బలహీన ప్రత్యర్థి బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. నేటి నుంచి ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో తొలి టెస్టు మ్యాచ్ జరుగుతుంది. సఫారీలపై చెలరేగిన కోహ్లి సేన అదే జట్టును కొనసాగిస్తుండగా... షకీబ్, తమీమ్‌లాంటి స్టార్లు లేకుండానే వచి్చన బంగ్లా ఏమాత్రం పోటీనివ్వగలదనేది సందేహమే.
ముగ్గురు పేసర్లతో...
రాంచీ టెస్టులో ఆడిన తుది జట్టు నుంచి ఒకే ఒక్క మార్పుతో భారత్ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. నాటి మ్యాచ్‌లో ఆడిన లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ స్థానంలో మూడో పేసర్‌ను ఆడించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఇండోర్ పిచ్ కొంత వరకు పేసర్లకు అనుకూలించే అవకాశం ఉండటం కూడా ఇందుకు కారణం. అదే జరిగితే ఇషాంత్ శర్మ జట్టులోకి వస్తాడు. ఇది మినహా మిగతా ఆటగాళ్లందరూ అద్భుతమైన ఫామ్‌లో ఉండి మరోసారి చెలరేగేందుకు సై అంటున్నారు.మరో ఇద్దరు పేసర్లు షమీ, ఉమేశ్ గత సిరీస్‌లో సత్తా చాటారు.
వీరికి తోడుగా ఇద్దరు స్పిన్నర్లు అశి్వన్, జడేజాలకు కూడా ఎదురు ఉండకపోవచ్చు. ఈ ఐదుగురిని సమర్థంగా ఎదుర్కోవడం బంగ్లా ఆటగాళ్లకు శక్తికి మించిన పని కావచ్చు. వికెట్ కీపర్‌గా సాహా ఖాయం కాబట్టి పంత్ మళ్లీ పెవిలియన్‌కే పరిమితం అవుతాడు. తొలిసారి ఓపెనర్‌గా ఆడిన సిరీస్‌లో రికార్డుల వరద పారించిన రోహిత్ శర్మ అదే జోరు కొనసాగిస్తే బంగ్లాకు కష్టాలు తప్పవు. మరో ఓపెనర్ మయాంక్ కూడా తనదైన శైలిలో భారీగా పరుగులు సాధిస్తున్నాడు. కోహ్లి ఆట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇండోర్‌లో గతంలో జరిగిన ఏకైక టెస్టులో కోహ్లి డబుల్ సెంచరీ సాధించాడు. అదే మ్యాచ్‌లో భారీ సెంచరీ చేసిన రహానే కూడా తన బ్యాట్‌కు పని చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాడు. పుజారా దక్షిణాఫ్రికాపై రెండు అర్ధ సెంచరీలు చేసినా అది అతని స్థాయికి తగ్గ ప్రదర్శన కాదు. కాబట్టి భారీ స్కోరుపైనే అతను కన్నేశాడు. ఐదుగురు బౌలర్ల ఫార్ములాపై కోహ్లి నిలబడ్డాడు కాబట్టి ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారికి మరోసారి తుది జట్టులో స్థానం కష్టంగా మారిపోయింది. జడేజా బ్యాటింగ్ బలం కూడా టీమ్‌కు అదనపు ప్రయోజనాన్ని అందిస్తోంది. దాంతో యువతార శుబ్‌మన్ గిల్ కూడా పెవిలియన్‌కే పరిమితం కానున్నాడు.
స్పిన్నర్లు రాణిస్తారా...
దాదాపు రెండున్నరేళ్ల క్రితం హైదరాబాద్‌లో భారత్‌తో బంగ్లాదేశ్ ఏకైక టెస్టు ఆడింది. ఇది మినహా వారికి ఇక్కడి అనుభవం లేదు. నాటి మ్యాచ్‌లో ఆడిన షకీబ్, తమీమ్ సిరీస్‌కు దూరం కాగా... ఆ జట్టులో ఉన్న ఐదుగురు ప్రస్తుతం ఈ టెస్టులో కూడా బరిలోకి దిగుతున్నారు. ఎంతో కొంత వీరు రాణిస్తేనే ఆ జట్టు పోటీనిచ్చే పరిస్థితిలో ఉంది. హైదరాబాద్ టెస్టులో సెంచరీ సాధించిన ముష్ఫికర్ రహీమ్ మరోసారి కీలకం కానున్నాడు. మహమ్మదుల్లా, కెప్టెన్ మోమినుల్ హక్‌లపై జట్టు బ్యాటింగ్ ప్రధానంగా ఆధారపడుతోంది.సీనియర్ ఓపెనర్ కైస్ స్థానంలో కొత్త ఆటగాడు సైఫ్ హసన్‌కు అవకాశం ఇవ్వాలని జట్టు భావిస్తోంది. బంగ్లా దేశవాళీ క్రికెట్‌లో ఇటీవల అతను అద్భుత ప్రదర్శన కనబర్చాడు.
టి20ల్లో పెద్దగా రాణించని మిథున్, లిటన్ దాస్ టెస్టుల్లో ఏమాత్రం ఆకట్టుకుంటారో చూడాలి. రెగ్యులర్ టెస్టు బౌలర్‌గా అబూ జాయెద్ ఒక్కడే కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. టెస్టుల్లో ముస్తఫిజుర్ బౌలింగ్ ఎప్పుడూ ప్రమాదకరంగా లేదు. అతనికి బదులుగా ఇబాదత్‌కు చాన్స్ దక్కినా ఆశ్చర్యం లేదు. బంగ్లా జట్టులో ఇద్దరు ప్రధాన స్పిన్నర్లు మెహదీ హసన్, తైజుల్ ఇస్లామ్ ఉన్నారు. అయితే అనుకూలంగా ఉన్న పిచ్‌లపై భారత స్పిన్నర్లు చెలరేగినా... టీమిండియా అబేధ్య బ్యాటింగ్ లైనప్ ముందు విదేశీ స్పిన్నర్లు తేలిపోవడం గతంలో చాలా సార్లు జరిగింది కాబట్టి వీరినుంచి కూడా పెద్దగా ఆశించలేం. మొత్తంగా చూస్తే పలు ప్రతికూలతల మధ్య బంగ్లాదేశ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
‘నేనూ అదే బాధ అనుభవించాను’
మానసిక ఆందోళన సమస్యలతో ఇటీవల ఆ్రస్టేలియా క్రికెటర్ మ్యాక్స్‌వెల్ ఆటకు నిరవధిక విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో మ్యాక్స్‌వెల్‌కు భారత కెపె్టన్ కోహ్లి మద్దతు పలికాడు. ఎలాంటి దాపరికం లేకుండా మ్యాక్సీ తన గురించి తాను చెప్పుకోవడం మంచి నిర్ణయమని, ఆటకు దూరంగా ఆటగాళ్లు విరామం అడగడాన్ని కూడా సమరి్థస్తున్నట్లు కోహ్లి చెప్పాడు. 2014లో తాను కూడా ఇదే తరహా ఆందోళనకు లోనయినట్లు విరాట్ గుర్తు చేసుకున్నాడు. ‘మనం సొంత పనుల్లో ఎంతగా నిమగ్నమైపోతామంటే ఇతరుల మనసులో ఎలాంటి బాధ ఉందో ఎవరికీ కనిపించదు.
2014 ఇంగ్లండ్ సిరీస్ సమయంలో నాకు కూడా ప్రపంచం ముగిసిపోయినట్లు అనిపించింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎవరికి, ఎలా చెప్పుకోవాలో తెలియదు. ఆ సమయంలో మానసికంగా ఇబ్బంది పడుతున్నానని, ఆటకు దూరం ఉండాలని భావిస్తున్నట్లు నేనైతే చెప్పలేకపోయేవాడినేమో. అలా చెబితే ఎవరైనా ఎలా అర్థం చేసుకుంటారోననే భయం. నా దృష్టిలో మ్యాక్స్‌వెల్ సరైన పని చేశాడు. సరిగ్గా చెప్పాలంటే మానసిక ఆందోళనతో దృష్టి పెట్టలేకపోతున్న క్రికెటర్లకు తగిన దారి చూపిం చాడు. ఎందుకంటే ఎంత ప్రయతి్నంచినా ఒక దశలో సరిదిద్దుకోలేని స్థితికి మన మనసు చేరుకుంటుంది’ అని కోహ్లి అన్నాడు.
పిచ్, వాతావరణం
ఇండోర్ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలం. చెప్పుకోదగ్గ స్థాయిలో బౌన్స్ కూడా ఉంటుంది కాబట్టి మంచి షాట్లకు అవకాశం ఉంది. బుధవారం పిచ్‌పై కొంత పచ్చిక కనిపిస్తోంది కాబట్టి మ్యాచ్ తొలి రోజు పేస్ బౌలింగ్‌కు కూడా సహకరించవచ్చు. అయితే ఈ దశ దాటితే భారీ స్కోరుకు బాట వేసుకున్నట్లే. వాతావరణం బాగుంది. వర్ష సూచన లేదు కాబట్టి ఆటకు ఇబ్బంది ఉండదు.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, మయాంక్, పుజారా, రహానే, సాహా, జడేజా, అశ్విన్, ఇషాంత్, ఉమేశ్, షమీ.
బంగ్లాదేశ్: మోమినుల్ హక్ (కెప్టెన్), షాద్‌మన్, సైఫ్ హసన్, ముష్ఫికర్, మహ్ముదుల్లా, మిథున్, లిటన్ దాస్, మెహదీ హసన్, తైజుల్, అబూ జాయెద్, ముస్తఫిజుర్/ఇబాదత్.
Comments
Please login to add a commentAdd a comment