సిల్హెట్ (బంగ్లాదేశ్): సొంతగడ్డపై జింబాబ్వేతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టు బెబ్బులిలా గర్జిస్తోంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2–0తో గెల్చుకున్న బంగ్లా మూడో మ్యాచ్‌నూ నెగ్గి వైట్‌వాష్‌పై కన్నేసింది. ఈక్రమంలో శుక్రవారం జరుగుతున్న నామమత్రాపు ఆఖరి వన్డేలో బంగ్లా ఓపెనర్లు లిటన్ దాస్ (143 బంతుల్లో 176; 16 ఫోర్లు, 8 సిక్సర్‌లు), తమీమ్ ఇక్బాల్ (109 బంతుల్లో 128; 7 ఫోర్లు, 6 సిక్సర్‌లు, నాటౌట్), సరికొత్త రికార్డును నెలకొల్పారు. టాస్ గెలిచిన జింబాబ్వే ఆతిథ్య జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించగా.. ఈ ఇద్దరూ చెలరేగి ఆడారు. ఈక్రమంలో పదేళ్ల రికార్డును తిరగరాశారు. మూడు వన్డేల సిరీస్‌లో ఇద్దరు ఆటగాళ్లు రెండు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన రికార్డును బద్దలు కొట్టారు. తొలి వన్డేలో సెంచరీ చేసిన లిటన్ దాస్, రెండో వన్డేలో సెంచరీ చేసిన తమీమ్ మూడో వన్డేలోనూ అదే పునరావృతం చేశారు.
(చదవండి: లిటన్ దాస్ శతకం: బంగ్లాదేశ్ భారీ గెలుపు)
2010లో ఇదే జింబాబ్వేపై దక్షిణాఫ్రికా ఓపెనర్లు హషీమ్ ఆమ్లా, డివిలియర్స్ తలో రెండు సెంచరీలు చేయగా.. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత తమీమ్ ఇక్బాల్, లిటన్ దాస్ ఆ ఫీట్ సాధించారు. ఇక వన్డేల్లో బంగ్లా ఓపెనర్లు ఇద్దరూ సెంచరీలు చేయడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ క్రమంలోనే బంగ్లా ఓపెనర్ల అత్యధిక పార్ట్‌నర్‌షిప్ రికార్డు కూడా తుడిచిపెట్టుకుపోయింది. వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదించిన ఈ ఇన్నింగ్స్‌లో బంగ్లా జట్టు 43వ ఓవర్ పూర్తయ్యే సరికి మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 323 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అయితే, మరోసారి వర్షం అడ్డుతగలడంతో బంగ్లా ఇన్నింగ్స్‌ను అక్కడితో నిలిపేసి..జింబాబ్వే లక్ష్యాన్ని 342 పరుగులకు సవరించారు.
(చదవండి: నేను వెళ్లనంటే వెళ్లను: ముష్ఫికర్)
Comments
Please login to add a commentAdd a comment