అండర్-19 ప్లేయర్ శుభ్‌మన్ గిల్
చంఢీఘడ్ : అండర్-19 ప్రపంచకప్ సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై సెంచరీతో ఆకట్టుకున్న శుభ్‌మన్ గిల్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. న్యూజిలాండ్ వేదికగా జరిగిన సెమీస్‌లో టీమిండియా యువ బ్యాట్స్‌మన్ శుభమన్ గిల్ (103) సెంచరీకి తోడు బౌలర్లు చెలరేగడంతో పాక్‌పై భారత్ 203 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.
ఇక శుభ్‌మన్ ప్రదర్శన పట్ల అతని తల్లితండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ పట్ల శుభ్‌మన్‌కు ఉన్న నిబద్ధతే అతన్ని ఈస్థాయికి తీసుకొచ్చిందని చెబుతూ మురిసిపోతున్నారు. శుభ్‌మన్ తండ్రి లక్వింధర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. శుభమన్‌కు మూడేళ్ల నుంచే క్రికెట్ అంటే పిచ్చని, దాన్ని గుర్తించి ప్రోత్సాహించమన్నారు. చిన్నప్పుడు ఏ బొమ్మ కొనిచ్చిన తీసుకునేవాడు కాదని, బ్యాట్, బంతినే ఇష్టపడేవాడని పేర్కొన్నారు. పడుకునేటప్పుడు సైతం బ్యాట్, బంతిని పక్కన పెట్టుకొని పడుకునే వాడని గుర్తు చేసుకుంటూ సంబరపడ్డారు.
పాకిస్థాన్‌పై సెంచరీ చేసి భారత్‌ను గెలిపించడంతో తల్లితండ్రులుగా ఉప్పొంగిపోయామన్నారు. నా కుమారుని ప్రదర్శన పట్ల తండ్రిగా గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. తల్లికీరత్ గౌరీ సైతం కొడుకు ప్రదర్శన పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తూ ఐపీఎల్‌లోఅద్భుతంగా రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
కెప్టన్ పృథ్వీషా తండ్రి పంకజ్‌షా సైతం సంతోషం వ్యక్తం చేశారు. అని విభాగాల్లో రాణించి ఫైనల్లోకి అడుగుపెట్టిన అండర్-19 జట్టును అభినందించారు. ప్రత్యేకంగా శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌ను కొనియాడాడు. దిగ్గజ క్రికెటర్లు, అభిమానులు సైతం శుభ్‌మన్ ఇన్నింగ్స్‌పై ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment