కీలక అప్‌డేట్ ఇచ్చిన రోహిత్ శర్మ
Rohit Sharma shares crucial update on Shubman Gill: వన్డే వరల్డ్‌కప్-2023లో మెగా ఫైట్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త చెప్పాడు. స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ తిరిగి జట్టుతో చేరనున్నట్లు తెలిపాడు. అయితే, అదే సమయంలో ఓ మెలిక కూడా పెట్టి ఫ్యాన్స్‌ను సందిగ్దంలోకి నెట్టేశాడు.
కాగా అక్టోబరు 14న దాయాదులు భారత్- పాకిస్తాన్ ప్రపంచకప్ ఈవెంట్లో తలపడేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్లు పోటీకి దిగనున్నాయి. క్రికెట్ ప్రపంచంలో భారీ క్రేజ్ ఉన్న మ్యాచ్‌గా చరిత్రకెక్కిన చిరకాల ప్రత్యర్థుల పోరుకు లక్ష సీట్ల సామర్థ్యం గల మోదీ స్టేడియం కిక్కిరిసిపోవడం లాంఛనమే!
డెంగ్యూ బారిన పడి.. రెండు మ్యాచ్‌లకు దూరమై
ఇదిలా ఉంటే.. వన్డే ప్రపంచకప్ టోర్నీకి ముందు సూపర్ ఫామ్‌లో ఉన్న టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్.. డెంగ్యూ బారిన పడిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లకు అతడు దూరం కాగా ఇషాన్ కిషన్ ఆ స్థానాన్ని భర్తీ చేశాడు.
గిల్ మ్యాచ్ ఆడేందుకు ఫిట్‌గా ఉన్నాడు
అయితే, గిల్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ ధ్రువీకరించాడు. శుబ్‌మన్ గిల్ మ్యాచ్ ఆడేందుకు ఫిట్‌గా ఉన్నాడని మీడియాకు తెలిపాడు. కానీ.. అతడిని పాక్‌తో మ్యాచ్‌లో ఆడించాలా లేదా అన్నది శనివారమే నిర్ణయిస్తామని పేర్కొన్నాడు.
ఈ మేరకు.. ‘‘శుబ్‌మన్ గిల్ 99 శాతం మ్యాచ్‌కు అందుబాటులోనే ఉంటాడు. అయితే, ఈ విషయం గురించి రేపటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాం’’ అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.
ఇషాన్‌ను తప్పించక తప్పదా?
ఇక నరేంద్ర మోదీ స్టేడియంలో అభిమానుల మద్దతు తమకు దండిగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని హిట్‌మ్యాన్ హర్షం వ్యక్తం చేశాడు. కాగా గిల్ ప్రస్తుతం అహ్మదాబాద్‌లోనే ఉన్నాడు. జట్టుతో కలిసి బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా చేసినట్లు సమాచారం. ఇక గిల్ రాకతో ఇషాన్‌పై వేటు పడటం ఖాయమే అనిపిస్తోంది.
అహ్మదాబాద్‌లో అద్భుతమైన రికార్డు ఉన్న గిల్‌ను ఆడిస్తారా లేదంటే ఆసియా వన్డే కప్-2023లో పాకిస్తాన్‌పై 82 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కిషాన్ వైపు మొగ్గు చూపుతారా శనివారం తేలనుంది.
చదవండి: ‘శార్దూల్ ఎందుకు? సిరాజ్‌ను ఎందుకు ఆడిస్తున్నారు?.. అసలేంటి ఇదంతా?’
Comments
Please login to add a commentAdd a comment