
యువరాజ్ సింగ్- శుబ్‌మన్ గిల్
ICC WC 2023- Ind Vs Pak- Yuvraj Singh- Shubman Gill: క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా సమరానికి సమయం ఆసన్నమైంది. చిరకాల ప్రత్యర్థులు టీమిండియా- పాకిస్తాన్ భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023లో తొలిసారి తలపడేందుకు సిద్ధమయ్యాయి.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబరు 14(శనివారం) దాయాదుల పోరుకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఇరు జట్లు అక్కడికి చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టేశాయి కూడా!
అహ్మదాబాద్‌లో ఆడితే చూడాలని
ఇక ఈ హైవోల్టేజీ మ్యాచ్‌తో టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. తనకిష్టమైన అహ్మదాబాద్ పిచ్‌పై పాకిస్తాన్ బౌలింగ్‌లో గిల్ పరుగుల వరద పారిస్తే చూడాలని కోరుకుంటున్నారు.
అయితే, ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ మ్యాచ్ నాటికి అందుబాటులో ఉంటాడో లేదో భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ చేసిన శుబ్‌మన్ గిల్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
క్యాన్సర్‌తో పోరాడుతూ వరల్డ్‌కప్ ఆడాను
‘‘ధైర్యంగా ఉండాలని శుబ్‌మన్ గిల్‌కు చెప్పాను. క్యాన్సర్‌తో పోరాడుతున్న సమయంలో నేను వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడానని చెప్పాను. వ్యాధితో పోరాడుతూనే ధైర్యం కూడదీసుకుని జట్టులోకి వచ్చానని తనతో అన్నాను. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ నాటికి గిల్ సిద్ధంగా ఉంటాడని ఆశిస్తున్నా. నిజమే.. డెంగ్యూ బారిన పడి తీవ్రమైన జ్వరంతో ఉన్నపుడు క్రికెట్ ఆడటం కష్టం.
గిల్ తప్పక ఆడతాడనే నమ్మకం
ఇలాంటివి నాకు అనుభవమే. అయితే, గిల్ కోలుకుని ఫిట్‌గా ఉంటే మాత్రం తప్పక మ్యాచ్ ఆడతాడు’’ అని యువీ వార్తాసంస్థ ఏఎన్‌ఐతో వ్యాఖ్యానించాడు. కాగా 2011 ప్రపంచకప్ సమయంలో యువరాజ్ క్యాన్సర్ బారిన పడిన విషయం వెల్లడైన సంగతి తెలిసిందే. కాగా అద్భుత ఆట తీరుతో సొంతగడ్డపై భారత్ జగజ్జేతగా అవతరించడంలో యువీ కీలక పాత్ర పోషించాడు.
2011 వరల్డ్‌కప్ హీరో.. గిల్ మెంటార్ యువీ..
2011 నాటి ఎడిషన్‌లో మొత్తంగా తొమ్మిది మ్యాచ్‌లలో 362 పరుగులు సాధించడంతో పాటు.. 15 వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విజేతగా నిలిచాడు. ఇదిలా ఉంటే.. డెంగ్యూ ఫీవర్ కారణంగా శుబ్‌మన్ గిల్ వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. కాగా పంజాబీ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌కు యువీ మెంటార్. అంతర్జాతీయ క్రికెటర్‌గా గిల్ ఎదగడంలో ఈ మాజీ ఆల్‌రౌండర్ పాత్ర ఉంది.
చదవండి: కంగారెత్తించే కంగారులకు ఏమైంది? తిరిగి గాడిలో పడేనా?
We are here in Ahmedabad! 👋#CWC23 | #TeamIndia | #INDvPAK | #MeninBlue pic.twitter.com/dVuOaynYRN
— BCCI (@BCCI) October 12, 2023