కొత్త జెర్సీలో టీమిండియా చమక్ చమక్!
టీమిండియా ఆటగాళ్లకు నూతన సంవత్సరం కానుకగా కొత్త జెర్సీని తీసుకొచ్చారు. మరో రెండు రోజుల్లో ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ కు సన్నద్ధమవుతున్న భారత క్రికెటర్లు, మహిళా ఆటగాళ్లు నూతన జెర్సీ ఆవిష్కరణలో పాల్గొన్నారు. భారత జెర్సీలో స్వల్ప మార్పులు చేసిన నైకీ సంస్థ, బీసీసీఐతో కలిసి నూతన కిట్ ను గురువారం ఆవిష్కరించింది. ప్రస్తుతం టీమిండియాకు నైకీ సంస్థ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోనీ, రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ, అజిక్యా రహానేలతో పాటుగా మహిళా టీమ్ ప్లేయర్స్ మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్ లను ఈ ఫొటోలో చూడవచ్చు. టీమిండియాకు పరిమిత ఓవర్ల క్రికెట్ లో కొత్త కెప్టెన్ తో పాటు కొత్త జెర్సీతో ఈ ఏడాది ప్రారంభించబోతోంది.
గతంలో ప్లాస్టిక్ రీసైకిల్ చేసిన ప్రొడక్ట్స్ తో 2015లో చివరిసారిగా జెర్సీని ప్రవేశపెట్టారు. భుజాల పక్కన భారత త్రివర్ణ పతాక రంగులతో చారలను ప్రింట్ చేశారు. ఈ 15న కోహ్లీ నేతృత్వంలో ఇంగ్లండ్ తో తలపడనున్న టీమిండియా నూతన జెర్సీతో బరిలోకి దిగనుందని బీసీసీఐ ప్రకటించింది. ఈ జెర్సీలో 4డీ క్విక్ నెస్, ట్యూన్డ్ బ్రీతబిలిటీ, జీరో డిస్ట్రాక్షన్ ఫీచర్లు ఉన్నాయని.. ఎండ వేడిమిని తట్టుకునేందుకు జెర్సీ చాలా సౌకర్యంగా ఉంటుందని నైకీ సంస్థ తెలిపింది.