
న్యూఢిల్లీ: ప్రపంచకప్ అనంతరం భారత్‌లో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌ల షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం ప్రకటించింది. 2019–20 సీజన్‌కుగానూ స్వదేశంలో జరుగనున్న 5 టెస్టులు, 9 వన్డేలు, 12 టి20ల్లో భారత్ వేర్వేరు జట్లతో తలపడనుంది. సెప్టెంబర్ 15న దక్షిణాఫ్రికాతో మొదలయ్యే ‘ఫ్రీడమ్ కప్’ ట్రోఫీతో ‘భారత హోమ్ సీజన్’ ప్రారంభమవుతుంది. ఫ్రీడమ్ కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో మూడు టి20లు, మూడు టెస్టులు జరుగుతాయి. అక్టోబర్ 2 నుంచి 6 వరకు జరిగే తొలి టెస్టుకు వైజాగ్ ఆతిథ్యం ఇవ్వనుంది. అనంతరం నవంబర్‌లో భారత్‌లో పర్యటించనున్న బంగ్లాదేశ్ 3 టి20లు, రెండు టెస్టులు ఆడుతుంది.
తర్వాత డిసెంబర్ 6 నుంచి 22 వరకు వెస్టిండీస్ పర్యటిస్తుంది. ఇందులో భాగంగా జరుగనున్న 3 టి20ల్లో చివరి మ్యాచ్‌కు హైదరాబాద్... 3 వన్డేల్లో రెండో మ్యాచ్‌కు వైజాగ్ వేదికలుగా ఉన్నాయి. డిసెంబర్ 6న ముంబైలో తొలి టి20, 8న తిరువనంతపురంలో రెండో టి20, 11న హైదరాబాద్‌లో మూడో టి20 జరుగుతాయి. డిసెంబర్ 15న చెన్నైలో తొలి వన్డే, 18న వైజాగ్‌లో రెండో వన్డే, 22న కటక్‌లో మూడో వన్డే జరుగుతాయి. తర్వాత జింబాబ్వేతో 3 మ్యాచ్‌ల టి20 సిరీస్ (జనవరి 5–10)... ఆస్ట్రేలియా (జనవరి 14–19), దక్షిణాఫ్రికా (మార్చి 12–18) లతో వరుసగా 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లు జరుగుతాయి. మార్చి 18న దక్షిణాఫ్రికాతో జరిగే చివరి మ్యాచ్‌తో భారత హోమ్ సీజన్ ముగుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment