న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో విద్యా సంస్థలు సెలవులు ప్రకటించగా... ఐటీ కారిడార్లు తమ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఆదేశాలు జారీ చేశాయి. తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా ఇదే బాటలో నడుస్తోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలోని తమ ప్రధాన కార్యాలయాన్ని నేటి నుంచి మూసివేయనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. తమ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయాలంటూ ఆదేశించింది. కోవిడ్–19 కారణంగా ఇప్పటికే పలు టోర్నీలను బీసీసీఐ వాయిదా వేసింది. ఈ జాబితాలో దేశవాళీ క్రికెట్ టోర్నీలు, ఇరానీ కప్, మహిళల చాలెంజర్ ట్రోఫీతో పాటు ఐపీఎల్ టోర్నీ కూడా ఉంది. మరోవైపు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) అన్ని జోనల్ శిక్షణా శిబిరాలను నిలిపివేసింది. కానీ బెంగళూరులోని ఎన్‌సీఏ పునరావాస కేంద్రం మాత్రం సోమవారం కూడా తన విధుల్లో నిమగ్నమై ఉంది. ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఈనెల 21 నుంచి జరగాల్సిన శిక్షణా శిబిరాన్ని వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment