పాక్‌తో క్రికెట్ ఆడే ప్రసక్తే లేదు
ముంబై: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్‌పై దాడులకు తెగబడుతున్న పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే ప్రసక్తే లేదని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తేల్చి చెప్పారు. వాస్తవానికి ఈ ఏడాది చివర్లో ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, రెండు టి20లు జరగాల్సి ఉంది. అయితే వేదిక ఎక్కడో తేల్చే విషయంలో ఇరు దేశాల ప్రభుత్వాలు ఓ కొలిక్కి రాకపోవడంతో సిరీస్ అటకెక్కింది. ఇప్పుడు తాజా ఉడీ దాడుల నేపథ్యంలో ఠాకూర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘పాకిస్తాన్ దేశం ఉగ్రవాదానికి ఊతమిస్తుందనే విషయాన్ని బహిర్గతపరచడం ఇప్పుడు మన ముందున్న లక్ష్యం. అలాంటి దేశంతో క్రికెట్ ఆడడమనే ప్రశ్నే లేదు’ అని ఠాకూర్ స్పష్టం చేశారు.