బీసీసీఐకి స్పాన్సర్లు కావలెను | BCCI sponsors wanted | Sakshi
Sakshi News home page

బీసీసీఐకి స్పాన్సర్లు కావలెను

Published Thu, Sep 19 2013 1:11 AM | Last Updated on Fri, Sep 1 2017 10:50 PM

BCCI sponsors wanted

ముంబై:  భారత్‌లో జరిగే అన్ని అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచ్‌లకు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ఎయిర్‌టెల్ తన కాంట్రాక్ట్‌ను పొడిగించలేదు. ఫలితంగా ఇప్పుడు బీసీసీఐ కొత్త స్పాన్సర్ వేటలో పడింది. ఎయిర్‌టెల్‌తో ఒప్పందం ఈ ఏడాది మార్చి 31నే ముగిసింది. అయితే పునరాలోచించుకునేందుకు బోర్డు మరో మూడు నెలల అదనపు సమయం ఇచ్చినా ఎయిర్‌టెల్ ఆసక్తి కనబర్చలేదు. 31 నెలల కాలానికిగాను ఈ టెలికాం సంస్థ ప్రతీ మ్యాచ్‌కు రూ. 3.33 కోట్ల చొప్పున చెల్లించింది. కొత్త స్పాన్సర్‌షిప్ కోసం టెండర్ డాక్యుమెంట్ ఖరారు చేసేందుకు ఫరూఖ్ అబ్దుల్లా నేతృత్వంలోని బోర్డు మార్కెటింగ్ కమిటీ గురువారం సమావేశం కానుంది. అయితే సహారా తప్పుకున్నందున టీమ్ స్పాన్సర్‌షిప్‌పై  ఎయిర్ టెల్ దృష్టి పెట్టినట్లు సమాచారం.
 ఆధునిక పరిజ్ఞానంతో కొత్త జెర్సీ
 ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ద్వారా భారత్ జట్టు కొత్త జెర్సీతో బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. దీనిని చాలా ఆదునిక పరిజ్ఞానంతో రూపొందించారు. 100 శాతం రీసైకిల్డ్ పాలిస్టర్‌తో తొలిసారి ఈ తరహా జెర్సీ తయారు కావడం విశేషం. భుజాలపై చక్కటి డిజైన్‌తో పాటు తేలిగ్గా, చెమట పట్టకుండా, చల్లగా ఉంటూ క్రికెటర్లకు మరింత సౌకర్యవంతంగా జెర్సీ ఉంటుందని జట్టు కిట్ స్పాన్సర్ నైకీ తెలిపింది. దీనిని రూపొందించడంలో ఆటగాళ్ల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.
 
 దక్షిణాఫ్రికా పర్యటనపై చర్చించలేదు: పటేల్
 దక్షిణాఫ్రికా పర్యటనపై భారత క్రికెట్ బోర్డు దోబూచులాట ఇంకా కొనసాగుతోంది. దుబాయ్‌లో దక్షిణాఫ్రికా బోర్డు సీఈఓ లొర్గాట్, బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ మధ్య భేటీతో పరిస్థితి చక్కబడిందనుకున్న తరుణంలో పటేల్ మరో కీలక వ్యాఖ్య చేశారు. అసలు తమ మధ్య దక్షిణాఫ్రికా సిరీస్‌కు సంబంధించి ఎలాంటి చర్చా జరగలేదని ఆయన స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement