బీసీసీఐకి సుప్రీంలో నిరాశ
న్యూఢిల్లీ: లోధా కమిటీ ప్రతిపాదనలను మరోసారి సమీక్షించాలంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) చేసిన అభ్యర్ధనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్ ను మంగళవారం విచారించిన సుప్రీం.. లోధా ప్రతిపాదనలపై ఆమోద ముద్ర వేస్తూ గతంలో తాము ఇచ్చిన తీర్పును తిరిగి పరిశీలించాల్సిన అవసరం లేదంటూ తేల్చి చెప్పింది.
బీసీసీఐ ప్రక్షాళనలో భాగంగా ఈ ఏడాది జనవరిలో లోధా కమిటి పలు ప్రతిపాదనలు సూచించిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనలకు సుప్రీంకోర్టు జూలై18వ తేదీన ఆమోద ముద్ర వేసింది. అయితే లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనల్లో కొన్ని అభ్యంతకరంగా ఉన్నాయంటూ బీసీసీఐ పిటిషన్ దాఖలు చేసింది. ప్రధానంగా కూలింగ్ పీరియడ్, ఒక రాష్ట్రానికి ఒక ఓటు, గరిష్ట వయో పరిమితలపై బీసీసీఐ తన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ వేసింది. అయితే ఆ పిటిషన్ పై సమీక్ష జరపడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది.