క్రికెట్‌ను జాగ్రత్తగా విస్తరిస్తాం: రిచర్డ్‌సన్
సిడ్నీ: క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేయాలనే ఆలోచన ఉన్నా మరీ బలహీన స్థితిలో ఈ ఆటను చూడలేమని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్‌సన్ స్పష్టం చేశారు. వచ్చే ప్రపంచకప్‌లో కేవలం 10 జట్లతోనే టోర్నీని నిర్వహించేందుకు ఐసీసీ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత టోర్నీ 14 జట్లతో జరుగుతోంది. అయితే ఈ ఆలోచనను అసోసియేట్ సభ్య దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇదే జరిగితే తమ దేశాల్లో క్రికెట్ అంతరించిపోతుందని ఆ జట్లు ఆందోళన వ్యక్తం చేశాయి.
‘ఇప్పుడు మేం ఓ నిర్ణయానికి వచ్చాం. క్రికెట్‌ను మరింత పటిష్టపర్చుకోవాలనుకుంటున్నామే తప్ప క్రేజ్ తగ్గించాలనుకోవడం లేదు. మాకు శాశ్వత సభ్య దేశాలున్నాయి. మేం ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంది’ అని రిచర్డ్‌సన్ అన్నారు. అమెరికాలో క్రికెట్‌ను అభివృద్ధి చేసే ఆలోచన ఉందని చెప్పారు. యూఏఈ ప్రపంచకప్‌కు అర్హత సాధించినప్పుడు అమెరికా ఎందుకు సాధించకూడదని ఆయన ప్రశ్నించారు.