ఓటమితో మొదలు...
న్యూఢిల్లీ: సొంతగడ్డపై కొత్త ఏడాదిని భారత హాకీ జట్టు పరాజయంతో ప్రారంభించింది. శుక్రవారం మొదలైన హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నమెంట్ గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 0-2 గోల్స్ తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. ఆడమ్ డిక్సన్ (28వ, 45వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేసి ఇంగ్లండ్ విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు.
కొత్త విదేశీ కోచ్ టెర్రీ వాల్ష్ ఆధ్వర్యంలో బరిలోకి దిగిన భారత్‌కు నాలుగు పెనాల్టీ కార్నర్‌లు లభించినా ఫలితం లేకపోయింది. మరోవైపు ఇంగ్లండ్ తమకు లభించిన ఐదు పెనాల్టీ కార్నర్స్‌లో రెండింటిని లక్ష్యానికి చేర్చింది. ఎదురుదాడుల్లో పదును లోపించడం.. పెనాల్టీ కార్నర్‌లు వృథా చేయడం... బలహీనమైన రక్షణపంక్తితో భారత జట్టు ఈ మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయింది.
ఆట 59వ నిమిషంలో రూపిందర్ పాల్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. అయితే గోల్ పోస్ట్ పక్క నుంచి భారత ఆటగాడు నెట్టిన బంతిని నిబంధనలకు విరుద్ధంగా ‘డి’ సర్కిల్ లోపలే నిలువరించారని ఇంగ్లండ్ ఆటగాళ్లు అంపైర్ నిర్ణయంపై సమీక్ష కోరారు. ఇంగ్లండ్ ఆటగాళ్లు ఊహించినట్టే భారత ఆటగాళ్లు బంతిని ‘డి’ సర్కిల్ లోపలే ఆపడంతో రిఫరీ ఈ గోల్‌ను రద్దు చేశారు. తొలి రోజే జరిగిన ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో జర్మనీ 6-1తో న్యూజిలాండ్‌పై; అర్జెంటీనా 5-2తో నెదర్లాండ్స్‌పై; ఆస్ట్రేలియా 3-2తో బెల్జియంపై విజయం సాధించాయి. శనివారం జరిగే లీగ్ మ్యాచ్‌ల్లో బెల్జియంతో అర్జెంటీనా; నెదర్లాండ్స్‌తో ఆస్ట్రేలియా; ఇంగ్లండ్‌తో జర్మనీ; న్యూజిలాండ్‌తో భారత్ తలపడతాయి.