బీసీసీఐ ఆధిపత్యానికి చెక్‌! | Big-Three rollback begins, BCCI opposes | Sakshi
Sakshi News home page

బీసీసీఐ ఆధిపత్యానికి చెక్‌!

Published Sun, Feb 5 2017 1:08 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

’సమావేశంలో ఐసీసీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ హిగ్గిన్స్, చైర్మన్‌ శశాంక్‌ మనోహర్, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవ్‌ రిచర్డ్‌సన్‌ - Sakshi

’సమావేశంలో ఐసీసీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ హిగ్గిన్స్, చైర్మన్‌ శశాంక్‌ మనోహర్, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవ్‌ రిచర్డ్‌సన్‌

ఆదాయ పంపిణీ వ్యవస్థలో మార్పులు
ఐసీసీ బోర్డు సమావేశంలో ఓటింగ్‌
ఏప్రిల్‌లో తుది ఆమోదం  


న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ధనిక బోర్డుగా పేరు తెచ్చుకున్న భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి నిజంగా ఇది ఊహించని పరిణామమే. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తాజాగా తమ సభ్య దేశాలకు పంపిణీ చేసే ఆదాయ ఫార్ములాలో విప్లవాత్మకమైన మార్పులకు ఓటేసింది. శనివారం దుబాయ్‌లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే సహజంగానే ఈ ప్రతిపాదనను బీసీసీఐ వ్యతిరేకించింది. ఈ విషయంలో భారత్‌కు కేవలం శ్రీలంక నుంచి మాత్రమే మద్దతు లభించింది. జింబాబ్వే ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఇక పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఆదాయ పంపిణీలో మార్పులతో పాటు పరిపాలనా వ్యవస్థలో మార్పులకు మద్దతుగా ఓటింగ్‌లో పాల్గొన్నాయి.

ఏప్రిల్‌లో జరిగే ఐసీసీ బోర్డు సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు వీటిలో ఏమైనా మార్పులు సూచించేందుకు 13 మంది బోర్డు సభ్యులకు ఐసీసీ గడువునిచ్చింది. ‘2014లో తీసుకున్న నిర్ణయాన్ని పునస్సమీక్షించాలని వర్కింగ్‌ గ్రూప్‌ నుంచి వచ్చిన ప్రతిపాదన, నియామవళి సవరణకు ఐసీసీ బోర్డులో ఆమోదం లభించింది. ఏప్రిల్‌లో జరిగే మరో సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటాం. సవరించిన ఆదాయ పంపిణీలో అందరికీ సమాన వాటా వస్తుంది. ఇది పారదర్శక పాలనకు దారితీస్తుంది’ అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే గత నెలలోనే సుప్రీం కోర్టు తమ పరిపాలకులుగా నియమించిందని, ఈ ప్రతిపాదనను అర్థం చేసుకోవడానికి తమకు తగిన సమయం కావాలనే వ్యతిరేకంగా ఓటింగ్‌ చేశానని బీసీసీఐ నుంచి ప్రతినిధిగా హాజరైన విక్రమ్‌ లిమాయే తెలిపారు.

‘బిగ్‌ త్రీ’కి దెబ్బే..
వాస్తవానికి క్రికెట్‌ దేశాలన్నింటిలోకి ఐసీసీకి బీసీసీఐ నుంచే అధికంగా ఆదాయం లభిస్తుంటుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ దేశాలుంటాయి. గతంలో శాశ్వత సభ్యులైన పది టెస్టు దేశాలకు ఐసీసీ సమానంగా రెవెన్యూను పంపిణీ చేసేది. కానీ తమ నుంచి అధిక ఆదాయం గడిస్తూ అందరితోపాటే తమకూ ఇవ్వడాన్ని బీసీసీఐ ప్రశ్నించింది. దీంతో అందరితో సమానంగా కాకుండా తమ మూడు దేశాలకు మెజారిటీ వాటాలివ్వాలని 2014లో అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు ఎన్‌.శ్రీనివాసన్‌ ‘బిగ్‌ త్రీ’ ఫార్ములాను ప్రతిపాదించారు. అయితే 2015లో ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికైన శశాంక్‌ మనోహర్‌ ఈ ప్రతిపాదనకు అడ్డు తగిలారు. దీనివల్ల చిన్న దేశాలు నష్టపోతాయని కొత్త ఫార్ములాను ప్రతిపాదించారు. విచిత్రంగా ఇప్పుడు బిగ్‌ త్రీలోని రెండు  సభ్యదేశాలు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కూడా మద్దతివ్వడం విశేషం.

మరిన్ని కీలక నిర్ణయాలు
అన్ని అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ల్లో నిలకడగా డీఆర్‌ఎస్‌ను అమలు చేయాలని చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (సీఈసీ) అంగీకారం. (జూన్‌లో ఇది తుది ఆమోదం పొందుతుంది)
నాసిరకం పిచ్, మైదానాలపై కఠిన వైఖరి అవలంభించేందుకు డీ మెరిట్‌ పాయింట్లను అమలు చేయాలని సీఈసీ నిర్ణయం. ఒక స్టేడియం ఐదు పాయింట్లు సాధిస్తే కనుక ఏడాది పాటు నిషేధం పడుతుంది. 10 పాయింట్లు సాధిస్తే రెండేళ్ల నిషేధం ఉంటుంది. ఒకపాయింట్‌కు ఐదేళ్ల పాటు నిషేధం అమల్లో ఉంటుంది.
అఫ్ఘానిస్తాన్‌కు చెందిన అహ్మద్‌ షా అబ్దాలి ప్రాంతీయ నాలుగు రోజుల టోర్నీకి ఫస్ట్‌ క్లాస్‌ హోదా లభించింది.  
సభ్యత్వ హోదా స్థాయిలను శాశ్వత సభ్యులు, అనుబంధ సభ్యల పేరిట రెండు విభాగాలుగా ఏర్పాటు.
కొత్తగా స్వతంత్ర మహిళా డైరెక్టర్‌ పదవి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement