
బోపన్న జంట ఓటమి
న్యూఢిల్లీ: షాంఘై మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జోడీ పోరాటం ముగిసింది. చైనాలోని షాంఘైలో శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న-మెర్జియా ద్వయం 6-7 (5/7), 4-6తో టాప్ సీడ్ బాబ్ బ్రయాన్-మైక్ బ్రయాన్ (అమెరికా) జంట చేతిలో పోరాడి ఓడింది. 68 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జోడీ తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసింది. సెమీస్‌లో ఓడిన బోపన్న జంటకు 60,730 డాలర్ల (రూ. 37 లక్షల 17 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 360 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.