
భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను పడగొట్టేశారు. పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై ప్రత్యర్థి కుప్పకూలిందంటే అది మన బౌలర్ల ఘనతే. ఓపెనర్లు ఎప్పటిలాగే విఫలమవగా రూట్ కూడా బుమ్రాకు చిక్కాడు. అయితే బుమ్రా నోబాల్‌లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి ఉంది. వికెట్ తీయడం, ఆపై నోబాల్‌గా తేలడం అందరినీ అసహనానికి గురి చేస్తుంది. బ్యాట్స్‌మెన్‌ను బాగా ఇబ్బంది పెట్టడంతోనే సరిపెట్టకుండా వికెట్లు తీయాల్సిన ఒత్తిడి కూడా షమీపై ఉంది.
కీలకమైన బట్లర్, స్టోక్స్ వికెట్లతో అతను తన సత్తా చాటాడు. కౌంటీల్లో అద్భుత ప్రదర్శన మొయిన్ అలీకి తుది జట్టులో చోటు దక్కేలా చేయగా, కరన్ మళ్లీ జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరి భాగస్వామ్యం పిచ్ ప్రమాదకరంగా ఏమీ లేదని నిరూపించింది. మన బౌలర్లు మేటి ఆటతో సిరీస్‌ను సమం చేసే అవకాశం కల్పించారు. గత టెస్టులాగే దీనిని పూర్తి చేయాల్సిన బాధ్యత ఇక బ్యాట్స్‌మెన్‌దే.