ఐదు రోజుల విరామమిస్తారా!  | Can not take five days off before Test series: Sunil Gavaskar | Sakshi
Sakshi News home page

ఐదు రోజుల విరామమిస్తారా! 

Published Mon, Aug 6 2018 1:06 AM | Last Updated on Mon, Aug 6 2018 1:06 AM

Can not take five days off before Test series: Sunil Gavaskar - Sakshi

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు భారత క్రికెటర్లకు వరుసగా ఐదు రోజులు ఎలాంటి ప్రాక్టీస్‌ లేకుండా పూర్తిగా విరామం ఇవ్వడాన్ని మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ తప్పు పట్టారు. సరిగ్గా సిద్ధమై ఉంటే తొలి టెస్టులో ఫలితం భిన్నంగా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘నెల రోజుల నుంచి ఇంగ్లండ్‌లో ఉన్నామని మన ఆటగాళ్లు చెబుతున్నారు. కానీ టెస్టుకు ముందు వన్డేలు, టి20లు చూస్తే అసలు క్రికెట్‌ ఆడింది ఎనిమిది రోజులే. తెల్ల బంతితో పోలిస్తే ఎరుపు రంగు బంతి భిన్నంగా స్పందిస్తుంది. దానికి ప్రాక్టీస్‌ ఏది? నిజంగా విశ్రాంతి కావాలనుకుంటే మ్యాచ్‌ల మధ్యలో మూడేసి రోజుల చొప్పున ఇవ్వవచ్చు. మరీ ఐదు రోజులంటే ఎలా? కోహ్లితో ఇతర ఆటగాళ్లు పోల్చుకోవద్దు. అతను 50 రోజుల విరామం తర్వాత కూడా వచ్చి సెంచరీ బాదేయగలడు. కానీ ఇతర బ్యాట్స్‌మెన్‌కు ప్రాక్టీస్‌ అవసరం’ అని గావస్కర్‌ వ్యాఖ్యానించారు.  

తరచూ ఆటగాళ్లను మార్చవద్దు: గంగూలీ 
తుది జట్టులో పదే పదే మార్పులు చేయకుండా ఆటగాళ్లపై విశ్వాసం ఉంచితేనే టెస్టుల్లో మంచి ఫలితాలు లభిస్తాయని మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ వ్యాఖ్యానించాడు. బ్యాట్స్‌మన్‌గా అద్భుతంగా ఆడుతున్నా... కెప్టెన్సీ విషయంలో కోహ్లి ఆలోచనలు మారాలని అతను సూచించాడు. ‘తన బ్యాట్స్‌మెన్‌కు ఎక్కువగా అవకాశాలు ఇవ్వడని, జట్టులో నుంచి తొందరగా తప్పిస్తాడని కోహ్లిపై ఒక విమర్శ ఉంది. ఇది అతను మార్చుకోవాలి. తన సహచరుల్లో ఆత్మవిశ్వాసం పెంచే ప్రయత్నం చేయాలి. వారి ఆలోచనా ధోరణిని అతను మార్చగలడు. నేను బాగా ఆడగలిగితే మీరెందుకు ఆడలేరు అంటూ స్ఫూర్తి నింపవచ్చు’ అని మాజీ కెప్టెన్‌ గంగూలీ  అన్నాడు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement