సాక్షి, హైదరాబాద్: సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నమెంట్‌లో ఎట్టకేలకు హైదరాబాద్ విజయాన్ని నమోదు చేసింది. న్యూఢిల్లీలోని పాలం ఎయిర్‌ఫోర్స్ కాంప్లెక్స్ గ్రౌండ్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో త్రిపురపై 8 వికెట్ల తేడాతో హైదరాబాద్ గెలుపొందింది. ఇప్పటివరకు టోర్నీలో ఐదు మ్యాచ్‌లాడిన హైదరాబాద్ గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమిని చవిచూసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన త్రిపురను హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేశారు. సీవీ మిలింద్ (3/11), మెహదీహసన్ (2/11), టి.రవితేజ (2/11), సిరాజ్ (2/20)ల ధాటికి త్రిపుర 17 ఓవర్లలో 9 వికెట్లకు 79 పరుగులు చేసింది. నిరుపమ్‌సేన్ చౌధరి (16) టాప్‌స్కోరర్. హైదరాబాద్ బౌలర్లు సమష్టిగా రాణించడంతో త్రిపుర బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలవలేకపోయారు.
రెండో వికెట్‌కు ఉదియన్ బోస్ (8), నిరుపమ్ నెలకొల్పిన 14 పరుగులే ఇన్నింగ్స్‌లో అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. టోర్నీలో తొలి విజయం కోసం తపిస్తోన్న హైదరాబాద్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. 80 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 13.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (41 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), సుమంత్ కొల్లా (20; 2 ఫోర్లు) రాణించారు. కెప్టెన్ అక్షత్ రెడ్డి (7) జట్టు స్కోరు 20 పరుగుల వద్ద తొలి వికెట్‌గా వెనుదిరగగా, 56 పరుగుల వద్ద సుమంత్ వికెట్‌ను హైదరాబాద్ కోల్పోయింది. అయితే బి. సందీప్ (12 నాటౌట్) సహాయంతో తన్మయ్ మిగతా పనిని పూర్తిచేశాడు. ప్రత్యర్థి బౌలర్లలో మణిశంకర్ మురా సింగ్, సంజయ్ మజుందార్ చెరో వికెట్ దక్కించుకున్నారు. నేడు జరిగే మ్యాచ్‌లో సర్వీసెస్‌తో హైదరాబాద్ ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment