భళా... భారత్
చివరి వన్డేలో ఘన విజయం
న్యూజిలాండ్ మహిళలపై 3-2తో సిరీస్ కైవసం
బెంగళూరు: మహిళల క్రికెట్‌లో పటిష్టమైన జట్లలో న్యూజిలాండ్ ఒకటి. ఆ జట్టుపై గతంలో భారత మహిళల ప్రదర్శన పేలవం. కానీ సొంతగడ్డపై చెలరేగిన మిథాలీ సేన గత రికార్డును తిరగరాసింది. సిరీస్‌లో ఒక దశలో వెనుకబడి కూడా స్ఫూర్తిదాయక ఆటతీరుతో వరుసగా రెండు విజయాలు సాధించి కివీస్ బృందానికి షాక్ ఇచ్చింది. ఐదు వన్డేల సిరీస్‌ను 3-2తో సొంతం చేసుకుంది.
బుధవారం ఇక్కడ జరిగిన చివరి వన్డేలో మిథాలీ సేన 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 41 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ సుజీ బేట్స్ (85 బంతుల్లో 42; 2 ఫోర్లు) మినహా ఇతర బ్యాట్స్ వుమెన్ విఫలమయ్యారు. భారత బౌలర్లు రాజేశ్వరి గైక్వాడ్ (2/15), జులన్ (2/17), దీప్తి శర్మ (2/22) సమష్టిగా రాణించారు.
అనంతరం భారత్ 27.2 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 121 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మూడో ఓవర్లోనే స్మృతి మందన (13) అవుటైనా... తిరుష్ కామిని (78 బంతుల్లో 62 నాటౌట్; 13 ఫోర్లు), దీప్తి శర్మ (78 బంతుల్లో 44 నాటౌట్; 8 ఫోర్లు) జట్టును గెలిపించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు అభేద్యంగా 103 పరుగులు జోడించడం విశేషం. ఇరు జట్ల మధ్య మూడు టి20ల సిరీస్ ఇదే వేదికపై శనివారం ప్రారంభమవుతుంది.
బీసీసీఐ బహుమతి రూ. 21 లక్షలు
న్యూజిలాండ్‌పై సిరీస్ విజయం సాధించిన భారత మహిళల జట్టును బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు జగ్మోహన్ దాల్మియా, అనురాగ్ ఠాకూర్ ప్రత్యేకంగా అభినందించారు. భారత జట్టుకు ప్రోత్సాహకంగా బోర్డు తరఫున రూ. 21 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు.
అయినా అట్టడుగునే...
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2017కు అర్హత సాధించేందుకు వీలుగా ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్ పేరుతో ప్రారంభించిన టోర్నీలో భాగంగా ఈ సిరీస్ జరిగింది. 2014 ఆగస్టు నుంచి 2016 ఆగస్టు వరకు టాప్-8 జట్లు మిగతా ఏడు జట్లతో కనీసం మూడు వన్డేల చొప్పున ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడతాయి. ప్రతీ మ్యాచ్‌కు 2 పాయింట్లు కేటాయిస్తారు. చివరకు అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. మిగతా నాలుగు జట్లు ఆరు రీజినల్ క్వాలిఫయింగ్ జట్లతో కలిసి మళ్లీ క్వాలిఫయర్లు ఆడాల్సి ఉంటుంది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9 మ్యాచ్‌ల ద్వారా భారత్ 2 విజయాలు, 6 పరాజయాలతో ఎనిమిదో స్థానంలో ఉంది. గత ఏడాది దక్షిణాఫ్రికాపై గెలిచిన వన్డేతో పాటు కివీస్‌తో గెలిచిన తొలి వన్డే ఇందులో ఉన్నాయి. కనీసం మూడు మ్యాచ్‌ల సిరీస్‌లు నిర్వహించాలి కాబట్టి చాంపియన్‌షిప్ కోసం ఏ సిరీస్‌లో అయినా తొలి మూడు వన్డేల ఫలితాలనే పరిగణలోకి తీసుకుంటారు. దీంతో నాలుగు, ఐదు వన్డేల్లో భారత్ నెగ్గినా...ఆ పాయింట్లు దీనికి పనికి రాలేదు.