ఫీల్డింగ్ కోచ్ గా హాడిన్
సిడ్నీ:ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్ ను ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్ గా ఎంపికచేశారు. గతంలో ఆసీస్ జట్టుకు వికెట్ కీపర్ బ్యాట్స్మన్ గా సేవలందించిన హాడిన్ కు ఫీల్డింగ్ కోచ్ గా బాధ్యతలు అప్పచెబుతూ క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నిర్ణయం తీసుకుంది. ఆసీస్ మాజీ బ్యాట్స్మన్ గ్రెగ్ బ్లెవెట్ స్థానంలో హాడిన్ ను ఫీల్డింగ్ కోచ్ గా నియమించారు. 2019 వరకూ హాడిన్ ఫీల్డింగ్ కోచ్ గా కొనసాగనున్నారు.
ఈ ఏడాది న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన ఆస్ట్రేలియా-ఎ జట్టుకు హాడిన్ కోచ్ గా పనిచేశారు. మరొకవైపు పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్(పీపీఎల్) లో ఇస్లామాబాద్ ప్రాంఛైజీకి కోచ్ గా హాడిన్ సేవలందించారు. ఆసీస్ తరపున 66 టెస్టులకు ప్రాతినిథ్య వహించిన హాడిన్ 262 క్యాచ్ లు అందుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో 126 వన్డేలు, 34 అంతర్జాతీయ ట్వంటీ 20 మ్యాచ్ లను హాడిన్ ఆడాడు. 2015లో తన అంతర్జాతీయ క్రికెట్ కు హాడిన్ గుడ్ బై చెప్పాడు.