'ఆ పేలుడు పరికరంతో హడిన్ కు సంబంధం లేదు'
సిడ్నీ:ఆస్ట్రేలియా క్రికెటర్ బ్రాడ్ హడిన్ ఇంటి ఆవరణలో దొరికిన పేలుడు పరికరంతో అతనికి ఎటువంటి సంబంధం లేదని పోలీసులు తెలిపారు. హడిన్ ఇంటి సమీపంలో శుక్రవారం పేలుడు పదార్థ పరికరం లభించడంతో అప్రమత్తమైన ఆస్ట్రేలియా పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్న అనంతరం దర్యాప్తు చేపట్టారు. ఈ పేలుడు పరికరంతో హడిన్ కు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు.
పేలుడు పదార్థాలతో హడిన్ కు కానీ, అతని కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి సంబంధం లేదని తమ దర్యాప్తులో తేలినట్లు రైడ్ లోకల్ ఏరియా కమాండ్ సూపరిండెంట్ జోన్ డంకన్ శనివారం పేర్కొన్నారు. కాగా, అనుమానాస్పద పేలుడు పరికరంపై ఎవరికైనా సమాచారం తెలిస్తే తమను సంప్రదించాల్సిందిగా స్థానికులకు విజ్ఞప్తి చేశారు.