బౌలర్లపైనే భారం
అగర్తలా: హైదరాబాద్ బౌలర్లు రాణిస్తేనే ఈ రంజీ సీజన్‌లో జట్టు బోణీ చేస్తుంది. రెండో ఇన్నింగ్స్‌లో త్రిపుర బ్యాట్స్‌మెన్ కుదురుగా ఆడటంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. గ్రూప్-సిలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆఖరి రోజు హైదరాబాద్ ఆటగాళ్లు ఏమాత్రం అలసత్వం వహించిన మరో డ్రాకు సిద్ధపడాలి. తొలి ఇన్నింగ్స్‌ను 491/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన హైదరాబాద్‌కు త్రిపుర రెండో ఇన్నింగ్స్ నుంచి ప్రతిఘటన ఎదురైంది. దీంతో ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 81 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. త్రిపుర ఇంకా 67 పరుగులు వెనుకంజలో ఉంది.
పూర్తయిన రవితేజ సెంచరీ
మూడో రోజు 487/9 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం ఆట కొనసాగించిన హైదరాబాద్ మరో నాలుగు పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఈ నాలుగు పరుగులు కెప్టెన్ రవితేజ (128 బంతుల్లో 100 నాటౌట్, 8 ఫోర్లు, 1 సిక్స్) చేయడంతో అతని సెంచరీ పూర్తయింది. మూడో రోజు ఉదయం హైదరాబాద్ కేవలం పది బంతులే ఆడి మొత్తానికి తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగుల భారీ ఆధిక్యం పొందింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన త్రిపుర... బ్యాట్స్‌మెన్ పోరాటంతో ఎదురీదుతోంది.
రాణించిన బోస్, సోలంకి
ఓపెనర్ బిశాల్ ఘోష్ (28 బంతుల్లో 18, 4 ఫోర్లు) తక్కువ స్కోరుకే అవుటైనప్పటికీ, కెప్టెన్ అభిజిత్ డే (123 బంతుల్లో 47, 7 ఫోర్లు)తో కలిసి మరో ఓపెనర్ ఉదియన్ బోస్ (139 బంతుల్లో 63, 10 ఫోర్లు, 1 సిక్స్) జట్టును నడిపించాడు. ఇద్దరు రెండో వికెట్‌కు 105 పరుగులు జోడించడంతో జట్టు స్కోరు వికెట్ నష్టానికి 133 పరుగులకు చేరింది.
ఈ దశలో సి.వి.మిలింద్ స్వల్ప వ్యవధిలో 3 టాపార్డర్ వికెట్లు కూల్చి హైదరాబాద్ శిబిరంలో ఉత్సాహం నింపాడు. కానీ రాకేశ్ సోలంకి (99 బంతుల్లో 71 బ్యా టింగ్, 10 ఫోర్లు), రాజేశ్ బాణిక్ (94 బంతుల్లో 31 బ్యాటింగ్, 4 ఫోర్లు) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. ఇద్దరూ అబేధ్యమైన ఐదో వికెట్‌కు 106 పరుగులు జోడించారు. కెప్టెన్ రవితేజ 8 మంది బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించిన ఈ జోడీని విడదీయలేకపోయారు.
స్కోరు వివరాలు
త్రిపుర తొలి ఇన్నింగ్స్: 184
హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 491/9 డిక్లేర్డ్
త్రిపుర రెండో ఇన్నింగ్స్: బిశాల్ ఘోష్ (సి) ఖలీల్ (బి) ఆశిష్ రెడ్డి 18; ఉదియన్ బోస్ (సి) ఖలీల్ (బి) మిలింద్ 63; అభిజిత్ డే (సి) భండారి (బి) మిలింద్ 47; సోలంకి బ్యాటింగ్ 71; తకవాలే (సి) భండారి (బి) మిలింద్ 0; రాజేశ్ బాణిక్ బ్యాటింగ్ 31; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (81 ఓవర్లలో 4 వికెట్లకు) 240.
వికెట్ల పతనం: 1-28, 2-133, 3-134, 4-134
బౌలింగ్: సి.వి.మిలింద్ 16-5-48-3, అన్వర్ 11-2-25-0; ఆశిష్ రెడ్డి 11-2-46-1, రవికిరణ్ 16-5-40-0, భండారి 16-1-39-0, రవితేజ 1-0-5-0, ఖాద్రి 9-2-25-0, తన్మయ్ 1-0-3-0