
బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయవచ్చా?
భారత్‌లో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాలకు చట్టబద్ధత కల్పించే అవకాశంపై జాతీయ లా కమిషన్ దృష్టి పెట్టింది.
రాష్ట్ర క్రికెట్ సంఘాల అభిప్రాయం కోరిన లా కమిషన్
న్యూఢిల్లీ: భారత్‌లో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాలకు చట్టబద్ధత కల్పించే అవకాశంపై జాతీయ లా కమిషన్ దృష్టి పెట్టింది. వివిధ రాష్ట్ర క్రికెట్ సంఘాలు అభిప్రాయాలు తమకు తెలియజేయాలంటూ బీసీసీఐకి లేఖ రాసింది. దేశంలో బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలంటూ లోధా కమిటీ గత ఏడాది సిఫారసు చేసింది. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు ఈ అంశంపై విస్తృతంగా చర్చించమంటూ లా కమిషన్‌ను ఆదేశించింది. ‘బెట్టింగ్ అంశంలో వివిధ వర్గాల నుంచి సమాచారం, అభిప్రాయాలు సేకరిస్తున్నాం. ఈ అంశంలో రాష్ట్ర క్రికెట్ సంఘాల సూచనలు, సలహాలు ఉపయోగపడవచ్చని మేం భావిస్తున్నాం.
మీ సంఘాల అభిప్రాయం తెలుసుకొని మాకు అందజేయండి’ అని లా కమిషన్ సభ్య కార్యదర్శి సంజయ్ సింగ్ బీసీసీఐని కోరారు. అయితే ఇది చాలా క్లిష్టమైన అంశమని బోర్డు అధికారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘చట్టబద్ధం చేస్తే బెట్టింగ్ హౌస్‌లను ప్రభుత్వం నడిపిస్తుందా? లేక ఏదైనా కంపెనీకి అప్పచెబుతారా? గ్యాంబ్లింగ్ కోసం ప్రత్యేక వ్యవస్థ అంటూ ఉంటుందా? మన దేశంలో లిక్కర్ బాధితులను దారిలోకి తెచ్చే కేంద్రాలే లేవు. ఇప్పుడు గ్యాంబ్లింగ్ వల్ల దారి తప్పిన వారి కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారా?’ అని ఆయన ప్రశ్నించారు.