క్యారమ్ ‘చాంపియన్’ శ్రీనివాస్
గుర్గావ్: ఆంధ్రప్రదేశ్ కుర్రాడు కె. శ్రీనివాస్ అంతర్జాతీయ క్యారమ్ టోర్నీలో మెరిశాడు. బుధవారం ఇక్కడ ముగిసిన ‘చాంపియన్ ఆఫ్ చాంపియన్స్’ అంతర్జాతీయ టోర్నీలో అతను విజేతగా నిలిచాడు. ఫైనల్లో శ్రీనివాస్ (భారత్) 13-25, 25-22, 25-14 స్కోరుతో చామిల్ కూరే (శ్రీలంక)పై విజయం సాధించాడు.
ప్రస్తుత జాతీయ చాంపియన్ కూడా అయిన 20 ఏళ్ల శ్రీనివాస్, తాను పాల్గొన్న ఏడో అంతర్జాతీయ టోర్నీలో తొలిసారి టైటిల్ దక్కించుకున్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో మొదటి గేమ్ 9 బోర్డుల పాటు సాగింది. ఆరంభంలో ఇద్దరూ సమ ఉజ్జీలుగా నిలిచినా నాలుగో బోర్డు తర్వాత చామిల్ ఒక్కసారిగా దూసుకుపోగా, శ్రీనివాస్ వెనుకబడిపోయాడు. రెండో గేమ్ 11 బోర్డులు కొనసాగింది.
9వ బోర్డు ముగిసే సరికి 23-22తో ఆధిక్యంలో నిలిచిన భారత ఆటగాడు, తర్వాతి రెండు బోర్డులు నెగ్గి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. మూడో గేమ్‌లో పూర్తిగా శ్రీనివాస్ జోరు కొనసాగింది. చివరకు పదో బోర్డును గెలుచుకొని చాంపియన్‌గా అవతరించాడు. అంతకు ముందు జరిగిన సెమీ ఫైనల్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ నిషాంత (శ్రీలంక)ను శ్రీనివాస్ 25-14, 25-16తో చిత్తు చేయడం విశేషం. మహిళల విభాగంలో వరల్డ్ చాంపియన్ రష్మీ కుమారి (భారత్) టైటిల్ సాధించింది. ఫైనల్లో ఆమె 22-08, 23-04తో ఎస్. ఇలవజకి (భారత్)పై ఘన విజయం సాధించింది.