
న్యూఢిల్లీ: కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన భారత క్రికెటర్లు.. తమ అనుభవాలను షేర్ చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా బీసీసీఐ టీవీ నిర్వహించిన ఒక షోలో యజ్వేంద్ర చహల్, మయాంక్ అగర్వల్, కుల్దీప్ యాదవ్‌లు తమ కెరీర్ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ క్రమంలోనే వెస్టిండీస్‌పై కుల్దీప్ సాధించిన హ్యాట్రిక్‌ను మయాంక్ గుర్తు చేయగా, 2017లో ఆస్ట్రేలియా జట్టు.. భారత పర్యటనలో భాగంగా మ్యాక్స్‌వెల్‌ను ఔట్ చేయడానికి రచించిన వ్యూహాన్ని చహల్‌ను అడిగి తెలుసుకున్నాడు. ఆ సమయంలో మ్యాక్స్‌వెల్‌కు బంతిని బాగా ఎడంగా వేయడానికి కారణాలు ఏమిటని మయాంక్ ప్రశ్నించాడు. (పాకిస్తాన్ చేసింది ముమ్మాటికీ తప్పే: వకార్)
దానికి చహల్ సమాధానం చెబుతూ,.. ‘ అది ఎంఎస్ ధోని ప్లాన్‌లో భాగం. మ్యాక్స్‌వెల్ కోసం ధోనితో కలిసి వ్యూహాన్ని రచించాం. మ్యాక్సీ ఎటాకింగ్ బ్యాట్స్‌మన్. స్పిన్ బౌలింగ్‌లో ఎదురుదాడికి దిగడానికి ఎక్కువగా యత్నించాడు. నా బౌలింగ్‌నే టార్గెట్ చేశాడు. దాంతో ఆఫ్ స్టంప్ బయటకు బంతిని సంధించమని ధోని చెప్పాడు. గ్రౌండ్ కింది భాగం నుంచి మ్యాక్సీ ఎక్కువగా బంతిని హిట్ చేస్తాడు. దాంతో అతని కోసం ఆ వ్యూహాన్ని అమలు చేశాం. బంతిని ఆఫ్ స్టంప్ బయటకు బాగా సంధించి సక్సెస్ అయ్యా,. అందుచేత మ్యాక్సీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బంతిని ఆఫ్ స్టంప్ బయట వేసేవాడ్ని. (‘రాహుల్ వద్దు.. రహానే బెటర్’)
ప్రత్యేకంగా ఆ సిరీస్ మూడో వన్డేలో మ్యాక్సీ వికెట్‌ను అలానే సాధించా. మ్యాక్సీని పదే పదే అసహనానికి గురి చేయడమే ప్రణాళికలో భాగం. నేను బౌలింగ్ వచ్చిన ప్రతీసారి హిట్టింగ్‌కు దిగేవాడు. దాంతో ధోనితో కలిసి వ్యూహం రచించాం. వేసే బంతి ఆఫ్ స్టంప్‌కు దూరంగా పడాలి.. కానీ వైడ్ కాకూడదు అని ధోని చెప్పాడు. అది వికెట్ టేకింగ్ డెలివరీ కావాలని ధోని చెప్పడంతో అవే బంతులు వేసేవాడ్ని’ అని ఈ లెగ్ స్పిన్నర్ చెప్పుకొచ్చాడు. ఆ ఐదు వన్డేల సిరీస్‌లో మ్యాక్స్‌వెల్‌ను మూడు సార్లు చహల్ ఔట్ చేయగా, రెండు టీ20ల సిరీస్‌లో ఒకసారి బోల్తా కొట్టించాడు. ఆ వన్డే సిరీస్‌ను భారత్ 4-1తో గెలవగా, టీ20 సిరీస్ 1-1తో సమం అయ్యింది. సిరీస్ నిర్ణయాత్మక మూడో టీ20 వర్షం వల్ల రద్దు కావడంతో ఆ సిరీస్‌ను ఇరు జట్లు సమంగా పంచుకోవాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment