IPL 2023, CSK Vs RCB: వాళ్లిద్దరు ఇంకాసేపు క్రీజులో ఉంటే మేము ఓడిపోయేవాళ్లం.. కానీ: ధోని | If Faf Du Plessis And Maxwell Would Have Continued They Would Have Finished The Game: MS Dhoni - Sakshi

#MS Dhoni: వాళ్లిద్దరు ఇంకాసేపు క్రీజులో ఉంటే మేము ఓడిపోయేవాళ్లం.. 18వ ఓవర్లోనే మ్యాచ్‌ ముగిసేది! కానీ..

Published Tue, Apr 18 2023 9:04 AM | Last Updated on Tue, Apr 18 2023 10:49 AM

IPL 2023 Dhoni: If Faf Maxi Continued They Would Have Won It By 18th Over - Sakshi

పతిరణ- ధోని (Photo Credit: IPL Twitter/BCCI)

IPL 2023 RCB Vs CSK- Dhoni Comments: ‘‘బెంగళూరు వికెట్‌పై ఆడటం ఎంతో బాగుంటుంది. ఆరంభంలో డ్యూ ఎక్కువగా ఉంటుంది. ప్రణాళికలు పక్కాగా అమలు చేస్తే తిరుగుండదు. సరైన సమయం కోసం వేచి చూశాం. ఇన్నింగ్స్‌ ద్వితీయార్థంలో వేగం పెంచాం. 

దూబే హిట్టింగ్‌ ఆడటంలో దిట్ట. అయితే, తను ఫాస్ట్‌బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడతాడు. స్పిన్నర్లను మాత్రం సమర్థవంతంగా ఎదుర్కొంటూ హిట్టింగ్‌ ఆడగలడు. నిజానికి తన విషయంలో మేము ముందు నుంచే కొన్ని ప్రణాళికలు రచించాం. కానీ.. గాయం బారిన పడిన కారణంగా పూర్తిస్థాయిలో వాటిని అమలు చేయలేకపోయాం.

ఆత్మవిశ్వాసం ముఖ్యం
అయితే, తనపై మాకు పూర్తి నమ్మకం ఉంది. మిడిల్‌ ఓవర్స్‌లో పరుగులు సాధించగలడు. ఈ విషయంలో మాకంటే కూడా తనపై తనకు ఎక్కువ నమ్మకం ఉండాలి. అతడి ప్రతిభ, నైపుణ్యాలపై మాకెలాంటి సందేహం లేదు.

కానీ ఒక్కసారి మైదానంలో దిగిన తర్వాత వ్యక్తిగత ప్రదర్శన బాగుండాలంటే ఆత్మవిశ్వాసం ఉండాలి’’ అని చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని అన్నాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో మెరుపు అర్ధ శతకంతో మెరిసిన శివం దూబే ఆట తీరును ప్రశంసిస్తూనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించాడు.

కాన్వే, దుబే దంచికొట్టారు
కాగా ఐపీఎల్‌-2023లో భాగంగా సోమవారం ఆర్సీబీ- సీఎస్‌కే  చిన్నస్వామి స్టేడియంలో తలపడ్డాయి. సొంతమైదానంలో టాస్‌ గెలిచిన ఆర్సీబీ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ధోని సేన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 226 పరుగులు చేసింది.

ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే 83(45 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) పరుగులతో అదరగొట్టగా.. నాలుగో స్థానంలో వచ్చిన శివం దూబే 27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 52 పరుగులు సాధించాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ ఆరంభంలోనే ఓపెనర్‌ విరాట్‌ కోహ్లి వికెట్‌ కోల్పోయింది.

ఫాఫ్‌, మాక్సీ సూపర్‌ ఇన్నింగ్స్‌
మరో ఓపెనర్‌, కెప్టెన్‌ ఫాప్‌ డుప్లెసిస్‌ 33 బంతుల్లో 62 పరుగులతో ఆకట్టుకోగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ 36 బంతుల్లో 76 పరుగులతో సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. కానీ మిగతా వాళ్ల నుంచి కావాల్సిన మేర సహకారం అందకపోవడంతో ఆర్సీబీ విజయానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ధోని సేన చేతిలో ఓటమి పాలైంది.

వాళ్లిద్దరు ఇంకాసేపు ఉంటే మేము ఓడిపోయేవాళ్లం
ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం ధోని మాట్లాడుతూ.. ఫాఫ్‌, మాక్సీ ఆట తీరును కొనియాడాడు. వాళ్లిద్దరూ ఇంకాసేపు క్రీజులో ఉంటే గనుక 18వ ఓవర్లోనే ఆర్సీబీ విజయం సాధించేదని పేర్కొన్నాడు. అయితే, తమ యువ బౌలర్లు డెత్‌ ఓవర్లలో అద్భుతంగా రాణించారంటూ ప్రశంసలు కురిపించాడు. డ్వేన్‌ బ్రావో మార్గదర్శనంలో సాధన చేస్తూ ఆత్మవిశ్వాసంతో ఒత్తిడిని అధిగమిస్తున్నారని పేర్కొన్నాడు.

పతిరణ సూపర్‌ హిట్‌
డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ చేయడం కష్టమని.. అయితే యువ బౌలర్లు మాత్రం ఎంతో సులువుగా పని పూర్తి చేస్తున్నారంటూ ధోని ప్రశంసించాడు. కాగా ఆర్సీబీ గెలవాలంటే విజయ సమీకరణం 18 బంతుల్లో 35 పరుగులు ఉన్న వేళ ధోని బంతిని పతిరణ, తుషార్‌ దేశ్‌పాండేలకు ఇచ్చాడు.

18వ ఓవర్లో పతిరణ కేవలం 4 పరుగులు మాత్రమే ఇవ్వగా.. తుషార్‌ 19 ఓవరల్లో 12 పరుగులు ఇచ్చాడు. ఇక ఆఖరి రెండు బంతుల్లో ఆర్సీబీకి 11 పరుగులు అవసరమైన వేళ పతిరణ.. తొలుత రెండు పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాతి బంతికి ప్రభుదేశాయ్‌ను అవుట్‌ చేసి చెన్నై గెలుపును ఖరారు చేశాడు. 

చదవండి: దురదృష్టం అంటే కోహ్లిదే.. అయ్యో విరాట్‌! బౌలర్‌కు మాత్రం!వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement