ముంబై : కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో క్రీడలన్నీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితమవడంతో వారంతా ఫామ్‌ను అందుకునేందుకు చాలా సమయం పడుతుందని టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ అంటున్నాడు. అందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను ఏదైనా సిరీస్ లేక టోర్నమెంట్ ముందు నిర్వహిస్తే ఆటగాళ్లు మునుపటి ఫామ్‌ను అందిపుచ్చుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో చహల్ మాట్లాడుతూ..' కరోనా ప్రభావం తగ్గి మైదానంలోకి దిగితే ఆటగాళ్లు ఫామ్‌ను అందుకోవడానికి సమయం తీసుకుంటారు. నా దృష్టిలో మిగతా సిరీస్‌లను నిలిపివేసి ఐపీఎల్‌ను నిర్వహిస్తే బాగుంటుంది. ఐపీఎల్‌ను నిర్వహించాలనుకుంటే మాత్రం రెండు నెలలు నిర్వహిస్తే ఆటగాళ్లకు మంచి ప్రాక్టీస్ దొరుకుతుంది. దీంతో రాబోయే సిరీస్‌లకు ఇది మంచి అవకాశంగా మారుతుందంటూ' పేర్కొన్నాడు.(నాకు సచిన్ వార్నింగ్ ఇచ్చాడు..: గంగూలీ)
బంతిని షైన్ చేసేందుకు సలైవాను ఉపయోగిస్తున్నారని, దీనివల్ల బౌలర్లకు మేలు జరగుతుందనే అభిప్రాయం ఉంది. దీనిపై నువ్వేమంటావు అని చాహల్‌ను ప్రశ్నించగా.. ' బంతిని పాతబడే కొద్ది దానిని షైన్ చేయకపోతే మాకు స్వింగ్ చేసే అవకాశం ఉండదు. అప్పుడు వికెట్లు రావడం కూడా కష్టమవుతుంది. ఇక బ్యాట్స్‌మెన్ ఎప్పుడైనా సిక్స్ కొడితే ఆ బంతిని తిరిగి తెచ్చుకోవాలనే కొత్త రూల్‌ను క్రికెట్‌లో యాడ్ చేయాల్సి వస్తుంది.. ఎందుకంటే అది బ్యాట్స్‌మెన్‌కు ప్రతీ బంతిని సిక్స్ కొట్టే అవకాశం ఇస్తుందని' నవ్వుతూ తెలిపాడు.
అయితే కరోనా వైరస్ నేపథ్యంలో అక్టోబర్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఐసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించినా ప్రపంచకప్ నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంతేగాక పరిస్థితులు ఇలాగే ఉంటే టీ 20 ప్రపంచకప్ 2021 ఫిబ్రవరి- మార్చిలో జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఐసీసీ ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. అక్టోబర్ వరకు కూడా కరోనా ప్రభావం తగ్గకపోతే ఖాళీ స్టేడియాల్లోనే మ్యాచ్‌లను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఇలా నిర్వహించడానికి ఐసీసీ సిద్ధంగా లేనట్లు తెలుస్తుంది.
(పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై నిషేధం)
Comments
Please login to add a commentAdd a comment