ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అన్ని క్రికెట్ లీగ్‌ల్లోకెళ్లా అత్యధిక సంపాదన అర్జిస్తుంది. దీనికి అనుబంధగా ఉన్న బీసీసీఐకి ఐపీఎల్ ద్వారా ఏటా కాసుల పంట కురుస్తుంది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ మీడియా రైట్స్ ఈ వేలం బోర్డుకు కనివినీ ఎరుగని రీతిలో కనకవర్షం కురిపించిన సంగతి తెలిసిందే. 2023-2027 మధ్య ఐదేళ్ల కాలానికి గానూ రూ.48, 390 కోట్ల రికార్డు ధరకు ఐపీఎల్ రైట్స్ అమ్ముడుపోవడం విశేషం.
ఈ వేలం ప్రక్రియలో డిస్సీ స్టార్ రూ.23,575 కోట్లు వెచ్చించి ఐపిఎల్ టీవీ హక్కులు సొంతం చేసుకోగా.. ముఖేష్ అంబానికి చెందిన వయాకామ్ 18, టైమ్స్ ఇంటర్నెట్ రూ. 24,815 కోట్లకు డిజిటల్ రైట్స్ దక్కించుకున్నాయి. దీంతో ప్రపంచంలో ఐపీఎల్ ప్రస్తుతం బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్‌గా అవతరించింది. అంతేకాదు అంతర్జాతీయంగా నేషనల్ ఫుట్‌బాల్ లీగ్(యూఎస్‌ఏ), నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్(యూఎస్‌ఏ), ఇంగ్లీష్ ప్రమీయర్ లీగ్(ఇంగ్లండ్) సరసన ఐపీఎల్ కూడా చోటు దక్కించుకుంది. ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్ విలువ ధర కూడా భారీగా పెరిగిపోయింది. గతంలో ఒక్కో మ్యాచ్ విలువ రూ. 54.5 కోట్లు ఉండగా.. ప్రస్తుతం రూ.114 కోట్లకు చేరుకోవడం విశేషం.
ప్రపంచంలోనే అత్యంత సంపాదన కలిగిన లీగ్‌గా ఐపీఎల్ దూసుకెళ్తుంటే కొంతమంది మాత్రం పనిగట్టుకొని విషం చిమ్ముతున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ ఐపీఎల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ అంతా బిజినెస్ అని.. ఎవరి స్వలాభం వారు చూసుకుంటున్నారని తెలిపాడు. లతీఫ్ మాట్లాడుతూ..''ఐపీఎల్ గురించి మాట్లాడితే క్రికెట్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఐపీఎల్ అంతా బిజినెస్. ఎవరి స్వలాభం వారు చూసుకుంటున్నారు..డబ్బులే ముఖ్యమనుకుంటే అదే దారిలో చాలా మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు.. వారిని కూడా జత చేసుకోండి.
ఐపీఎల్‌లో బిజినెస్ ఎక్కువయ్యి క్వాలిటి తగ్గిపోయింది. అంతా కమర్షియల్ అయిపోవడంతో ప్రస్తుతం ఐపీఎల్ చూసేవారి సంఖ్య తగ్గిపోతుంది.ఐపీఎల్ జరుగుతున్న సమయంలో ఒక భారతీయుడిని పిలిచి మీరు ఎన్ని గంటలు మ్యాచ్ చూస్తున్నారని అడగండి.. సమాధానం మీకే తెలుస్తుంది. అందుకే అంటాను ఐపీఎల్ ఒక బిజినెస్ అని.. నా మాటకు కట్టుబడి ఉంటా'' అంటూ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment