
బక్కపలుచగా ఉండే స్పిన్ బౌలర్ యజువేంద్ర చాహల్ మైదానంలోనే కాదు సోషల్ మీడియాలోనూ పాపులర్. సింగిల్ లైన్ పంచ్ డైలాగులతో నెటిజన్లను ఆకట్టుకును చాహల్ తాజాగా టీమ్‌మేట్ రోహిత్ శర్మకు చుక్కలు చూపించే కౌంటర్ ఇచ్చాడు.
దక్షిణాఫ్రికాతో జరగబోయే వన్డేలు, టీ-20 సిరీస్ కోసం బెంగళూరులో శిక్షణ తీసుకుంటున్న చాహల్ తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫొటో పెట్టాడు. కేజీఏ గోల్ఫ్ కోర్స్‌లో గోల్ఫ్ క్లబ్ పట్టుకొని దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. లైకులు, కామెంట్లతో వైరల్‌గా మారిన ఈ ఫొటోపై రోహిత్ శర్మ సరదాగా .. 'గోల్ఫ్ స్టిక్‌తోపాటు నువ్వూ ఎగిరిపోయేవు..జాగ్రత్త' అంటూ కామెంట్ పెట్టాడు. బక్కపలుచగా ఉంటాడు కాబట్టి రోహిత్ ఈ కామెంట్ పెట్టాడు. ఇక, టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ కూడా .. నీ పవర్‌కు ఒక్క షాట్‌కే హోల్‌ను అందుకుంటావు అని కామెంట్ పెట్టాడు. కానీ ఈ ఫన్నీ కామెంట్ వార్‌లో తనదే పైచేయి అని చాహల్ నిరూపించకున్నాడు. 'స్టిక్ అయితే నేనూ ఎగిరిపోయేవాడినేమో.. కానీ దీనిని గోల్ఫ్ క్లబ్ అంటారు భయ్యా.. హహాహా' అంటూ దిమ్మతిరిగే ఫన్నీ కౌంటర్ ఇచ్చాడు.