
భారత క్రికెటర్లకు జహీర్ సూచన!
న్యూఢిల్లీ: రాబోవు క్రికెట్ సీజన్లో భారత జట్టు పదమూడు టెస్టులు ఆడనుంది. స్వదేశంలో జరిగే సిరీస్ల్లో న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా దేశాలతో భారత క్రికెట్ జట్టు భారీ సంఖ్యలో మ్యాచ్లకు సిద్ధమవుతుంది. అయితే ఇలా భారీ ఎత్తున టెస్టు మ్యాచ్లు ఆడటం కచ్చితంగా సంప్రదాయ టెస్టు క్రికెట్కు ఒక శుభపరిణామని మాజీ పేసర్ జహీర్ ఖాన్ పేర్కొన్నాడు.
కాగా, ఇంతటి భారీ స్థాయిలో క్రికెట్ ఆడాల్సి రావడం ఆటగాళ్ల కెరీర్లో అరుదుగా జరుగుతూ ఉంటుందని, దాన్ని ప్రతీ ఒక్క భారత క్రికెటర్ ఛాలెంజ్గా తీసుకోవాలని సూచించాడు. తమ కెరీర్లో క్రికెటర్ల ప్రతిభ మరింత మెరుగుపడాలన్నా, వారి గ్రాఫ్ పడిపోవాలన్నా ఇటువంటి సీజన్లే నిర్ణయిస్తు ఉంటాయన్నాడు.
'క్రికెటర్లకు ఇదే నా సలహా. మీరు సానుకూల ధోరణితో ఉంటే మీ రిథమ్ను అంది పుచ్చుకుంటారు. ఈ తరహా అవకాశం అన్నిసార్లూ రాదు. ఇది ప్రతీ ఒక్కరికి కీలక సిరీస్ అని కచ్చితంగా చెప్పగలను. గతంలో నాకు ఒకసారి ఇదే తరహా అవకాశం ఉంది. అది నా అంతర్జాతీయ కెరీర్కు చాలా మేలు చేసింది' అని జహీర్ తన జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నాడు.