రెచ్చిపోయిన రైనా, చెన్నై భారీ స్కోరు
బెంగళూరు: ఫోర్లు, సిక్సర్లతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం హోరెత్తింది. పరుగుల సునామీకి అభిమానులు తడిసిముద్దయ్యారు. సురేష్ రైనా (43 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 90) మెరుపు విన్యాసాలతో చెలరేగడంతో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. చాంపియన్స్ లీగ్లో భాగంగా డాల్ఫిన్స్తో సోమవారం జరుగుతున్న మ్యాచ్లో చెన్నై పూర్తి ఓవర్లలో ఆరు వికెట్లకు 242 పరుగులు చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన చెన్నైతొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ డ్వెన్ స్మిత్.. మహారాజ్ బౌలింగ్లో అవుటయ్యాడు. అయితే ఆ తర్వాత చెన్నై బ్యాట్స్మెన్ డాల్ఫిన్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు. బ్రెండన్ మెకల్లమ్, రైనా దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. దీంతో తొమ్మిదో ఓవర్లోనే స్కోరు 100 పరుగులు దాటింది. రైనా 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. మెకల్లమ్ పరుగు తేడాతో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. రైనా అదే దూకుడు కొనసాగించగా, అతనికి డూప్లెసిస్ అండగా నిలచాడు. కాగా సెంచరీకి చేరువలో రైనా వెనుదిరగడంతో చెన్నై జోరు కాస్త తగ్గింది. చివర్లో రవీంద్ర జడేజా (14 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 నాటౌట్) రెచ్చిపోవడంతో చెన్నై భారీ స్కోరు నమోదు చేసింది.