చాంపియన్ చెన్నైయిన్ | Chennai beats Goa to lift ISL trohpy | Sakshi
Sakshi News home page

చాంపియన్ చెన్నైయిన్

Published Mon, Dec 21 2015 1:38 AM | Last Updated on Sun, Sep 3 2017 2:18 PM

చాంపియన్ చెన్నైయిన్

చాంపియన్ చెన్నైయిన్

ఊహకందని మలుపులతో సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ రెండో సీజన్‌కు అద్వితీయ ముగింపు లభించింది. గతేడాది సెమీస్‌లోనే నిష్ర్కమించిన చెన్నైయిన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) ఈసారి ఓటమి అంచుల నుంచి బయటపడి విజేతగా అవతరించింది. లీగ్ దశలో టాపర్‌గా నిలిచిన గోవా ఎఫ్‌సీతో జరిగిన టైటిల్ పోరులో చెన్నైయిన్ చివరి నిమిషాల్లో అద్భుతం చేసి ఔరా అనిపించింది. మరో మూడు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా చెన్నైయిన్ జట్టు నిర్ణాయక గోల్ సాధించి సగర్వంగా ట్రోఫీని అందుకుంది. చివరి నిమిషాల్లో తడబడిన గోవా తుదకు తగిన మూల్యం చెల్లించి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
 
* ఐఎస్‌ఎల్ ట్రోఫీ హస్తగతం   
* ఫైనల్లో గోవాపై 3-2తో విజయం  
* రూ. 8 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం

ఫటోర్డా (గోవా): పరిస్థితులు ఎలా ఉన్నా చివరి క్షణం వరకు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పోరాడితే దాని ఫలితం ఎలా ఉంటుందో చెన్నైయిన్ జట్టు రుచి చూసింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ రెండో సీజన్‌లో చాంపియన్‌గా ఆవిర్భవించింది.

గోవా ఎఫ్‌సీ జట్టుతో ఆదివారం జరిగిన ఫైనల్లో చెన్నైయిన్ జట్టు 3-2 గోల్స్ తేడాతో విజయం సాధించింది. 90వ నిమిషం వరకు 1-2తో వెనుకబడిన చెన్నైయిన్ జట్టుకు గోవా గోల్‌కీపర్ లక్ష్మీకాంత్ కట్టిమాని ‘సెల్ఫ్ గోల్’తో ఊపిరి పోయగా... ఇంజ్యూరీ టైమ్‌లో (90+2వ నిమిషంలో) మెండోజా గోల్ సాధించి చెన్నైయిన్ జట్టును చాంపియన్‌గా నిలబెట్టాడు. చివరి క్షణం వరకు అప్రమత్తంగా లేకపోతే దాని మూల్యం ఏస్థాయిలో ఉంటుందో గోవా జట్టుకు ఈ మ్యాచ్ ద్వారా తెలిసొచ్చింది.
 
మ్యాచ్  అంటే ఇదీ.. అనే తరహాలో సాగిన అంతిమ సమరంలో చెన్నైయిన్ జట్టుకు అదృష్టం కూడా కలిసొచ్చింది. తాజా విజయంతో గోవాలో ఎప్పుడు ఆడినా తమదే గెలుపనే సెంటిమెంట్‌ను చెన్నైయిన్ మరోసారి నిజం చేసుకుంది. బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్, భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ ధోని సహ యజమానులుగా ఉన్న చెన్నైయిన్ జట్టుకు విజేత హోదాలో ట్రోఫీతోపాటు రూ. 8 కోట్ల నజరానా అందగా... రన్నరప్ గోవాకు రూ. 4 కోట్లు లభించాయి.

సెమీస్‌లో ఓడిన కోల్‌కతా, ఢిల్లీ డైనమోస్ జట్లకు రూ. కోటీ 50 లక్షల చొప్పున ప్రైజ్‌మనీ ఇచ్చారు. మ్యాచ్‌ను వీక్షించేందుకు ముకేశ్ అంబానీ, నీతా అంబానీతో పాటు గోవా సహ యజమాని, క్రికెటర్ కోహ్లి తన గర్ల్‌ఫ్రెండ్ అనుష్క శర్మతో హాజరయ్యారు.
 
ఆద్యంతం హోరాహోరీ...
భారీగా తరలివచ్చిన సొంత ప్రేక్షకుల మద్దతుతో చెలరేగిన గోవా ఆరంభం నుంచి తమ బలాన్నే నమ్ముకుంటూ దూకుడు కనబరిచింది. వేగంగా పాస్‌లు ఇచ్చుకుంటూ గోల్స్ కోసం ప్రయత్నించింది. ఆరో నిమిషంలో ప్రత్యర్థి తలతో ఢీకొన్న గోవా స్ట్రయికర్ డుడు గాయపడడంతో మైదానం వీడాడు. తొలి 25 నిమిషాలు ఇరు జట్ల నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. 33వ నిమిషంలో గోవాకు ఫ్రీకిక్ చాన్స్ లభించింది. అయితే లియో మౌరా సంధించిన షాట్ గోల్ పోస్ట్ కుడివైపునుంచి బయటికి వెళ్లింది.

ఐదు నిమిషాల వ్యవధిలో గోవాకు కొయెల్హో హెడర్ గోల్ ప్రయత్నం చేసినా తృటిలో తప్పింది. దీంతో తొలి అర్ధభాగం గోల్స్ నమోదు కాకుండానే ముగిసింది. అయితే ద్వితీయార్ధంలో ఆట స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. 53వ నిమిషంలో చెన్నైయిన్ స్టార్ స్ట్రయికర్ మెండోజాను ఇన్‌సైడ్ బాక్స్‌లో ప్రణయ్ కిందపడేయడంతో పెనాల్టీ అవకాశం దక్కింది. దీనిని సద్వినియోగం చేసుకుంటూ పెలిస్సారి జట్టుకు తొలి గోల్ అందించాడు. అయితే నాలుగు నిమిషాల వ్యవధిలోనే గోవా స్కోరును 1-1తో సమం చేసింది.

రోమియో అందించిన క్రాస్‌ను సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన హవోకిప్ మెరుపు వేగంతో గోల్‌పోస్టులోకి పంపి సంతోషం నింపాడు. కానీ 59వ నిమిషంలో తమకు లభించిన రెండో పెనాల్టీని చెన్నైయిన్ సద్వినియోగం చేసుకోలేపోయింది. మెండోజా షాట్‌ను గోవా కీపర్ లక్ష్మీకాంత్ సులువుగా అడ్డుకున్నాడు. 87వ నిమిషంలో గోవాకు లభించిన ఫ్రీకిక్‌ను జోఫ్రే గోల్‌తో 2-1 ఆధిక్యం సాధించింది. అయితే ఈ ఆనందాన్ని స్వయం తప్పిదంతో గోవా కోల్పోయింది.

90వ నిమిషంలో బంతిని ఆపే ప్రయత్నంలో గాల్లోకి ఎగిరిన కీపర్ లక్ష్మీకాంత్ చేతిని తాకుతూ గోల్ కావడంతో స్కో రు తిరిగి సమమైంది. అయితే అదనపు సమయం (90+2వ నిమిషం)లో మెండోజా సూపర్ గోల్‌తో చెన్నైయిన్ విజేతగా నిలిచింది.
 
చెన్నైయిన్ జట్టుకు బ్రూనో పెలిస్సారి (54వ నిమిషంలో), మెండోజా (90+2వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. గోవా గోల్‌కీపర్ లక్ష్మీకాంత్ కట్టిమాని 90వ నిమిషంలో ‘సెల్ఫ్ గోల్’ చేశాడు. గోవా తరఫున హవోకిప్ (58వ నిమిషంలో), జోఫ్రే (87వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement