చెన్నై స్మాషర్స్దే టైటిల్
ఢిల్లీ: ప్రీమియర్ లీగ్ బ్యాడ్మింటన్(పీబీఎల్) -2017టైటిల్ను చెన్నై స్మాషర్స్ కైవసం చేసుకుంది. నగరంలో శనివారం జరిగిన తుదిపోరులో చెన్నై స్మాషర్స్ 4-3 తేడాతో ముంబై రాకెట్స్ను ఓడించి టైటిల్ ను చేజిక్కించుకుంది. మహిళల సింగిల్స్ లో చెన్నై స్మాషర్స్ క్రీడాకారిణి పివి సింధు 11-8, 11-8 తేడాతో సంగ్ జి హ్యూన్ పై గెలిచి ఆ జట్టు టైటిల్ సాధించడంలో ప్రధాన పాత్ర పోషించింది.
అంతకుముందు పురుషుల డబుల్స్ క్రిస్ అడ్కాక్-గాబ్రియల్ అడ్కాక్ జంట 11-9,11-6 తేడాతో నిపిట్ఫోన్-నడిజ్డా జీబా ద్వయం గెలిచింది. ఇది చెన్నై స్మాషర్స్ కు ట్రంప్ మ్యాచ్ కావడంతో ఆ జట్టు 2-0 ఆధిక్యం సాధించింది. అనంతరం సింధు మ్యాచ్ను గెలవడంతో చెన్నై ముందుకు దూసుకుపోయింది. అయితే ఆ తరుణంలో ముంబై తన ట్రంప్ మ్యాచ్లో విజయం సాధించి చెన్నై ఆధిక్యాన్ని 3-2కు తగ్గించింది. ఆ తరువాత ముంబై రాకెట్స్ ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ 11-4, 8-11,11-8 తేడాతో పారుపల్లి కశ్యప్ను ఓడించి స్కోరును 3-3 తో సమం చేశాడు.
కాగా, ముంబై రాకెట్స్ ఆటగాడు అజయ్ జయరామ్, చెన్నై స్మాషర్స్ ఆటగాడు తనోంగ్సాక్ల మధ్య ఫలితం కోసం జరిగిన పోరు ఆసక్తిగా సాగింది. ఇరువురు ఆటగాళ్లు ప్రతీ పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించారు. ఈ పోరులో తనోంగ్సాక్ 9-11, 11-7,11-3 తేడాతో అజయ్ జయరామ్ను ఓడించాడు. దాంతో చెన్నై స్మాషర్స్ 4-3 తేడాతో గెలిచి టైటిల్ ను సొంతం చేసుకుంది.