దుబాయ్: భారత బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకాడు. మంగళవారం విడుదల చేసిన టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకుల్లో అతను రెండు స్థానాల్ని మెరుగుపర్చుకున్నాడు. స్మిత్ (941 పాయింట్లు) టాప్ ర్యాంకులో ఉండగా... పుజారా 888 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. రెండో టెస్టులో డబుల్ సెంచరీ బాదిన కెప్టెన్ కోహ్లి మాత్రం నిలకడగా ఐదో ర్యాంకులోనే ఉన్నాడు. టాప్–10లో మరో భారత ఆటగాడు రాహుల్ తొమ్మిదో స్థానంలో ఉండగా... రహానే 15వ, ధావన్ 29వ ర్యాంకులకు పడిపోయారు. టెస్టు బౌలర్ల ర్యాంకుల్లో జడేజా తిరిగి రెండో స్థానానికి చేరుకోగా... అశ్విన్ నాలుగో ర్యాంకులో నిలిచాడు. భువీ, ఇషాంత్‌లు ఒక్కో స్థానాన్ని మెరుగుపర్చుకొని వరుసగా 28, 30వ ర్యాంకుల్లో ఉన్నారు.
స్మిత్ పాయింట్ల జోరు
యాషెస్ టెస్టులో సెంచరీ చేసిన స్మిత్ (941) ఐదు రేటింగ్ పాయింట్లను మెరుగుపర్చుకొన్నాడు. టెస్టు ర్యాంకింగ్స్ చరిత్రలో అత్యధిక పాయింట్లకు చేరిన ఐదో బ్యాట్స్‌మన్‌గా పీటర్ మే (941; ఇంగ్లండ్)తో సమంగా నిలిచాడు. ఇందులో బ్రాడ్‌మన్ (961; ఆసీస్)దే అగ్రస్థానం కాగా, హటన్ (945; ఇంగ్లండ్), హబ్స్ (942; ఇంగ్లండ్), పాంటింగ్ (942; ఆసీస్) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment