ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా సత్తా చాటారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా జరిగిన తొలి రెండు టెస్ట్‌ల్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసిన వీరు బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండర్ల విభాగంలో ర్యాంకులను మెరుగుపర్చుకున్నారు.
ఇదే సిరీస్‌లో తొలి టెస్ట్‌లో సెంచరీ చేసినప్పటికీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ర్యాంక్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. హిట్‌మ్యాన్ ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. యాక్సిడెంట్ కారణంగా గత రెండు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నప్పటికీ రిషబ్ పంత్ 6వ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు.
ఈ విభాగంలో లబూషేన్ టాప్‌లో కొనసాగుతుండగా.. స్టీవ్ స్మిత్, బాబర్ ఆజమ్ రెండు, మూడు స్థానాలను పదిలం చేసుకున్నారు. ఈ సిరీస్‌లో రెండు అర్ధసెంచరీలతో(84, 74) చెలరేగిన అక్షర్ పటేల్.. ఏకంగా 18 స్థానాలు ఎగబాకి బ్యాటింగ్ విభాగంలో 61వ ప్లేస్‌కు చేరుకున్నాడు. కోహ్లి 16వ స్థానంలో, జడేజా 33వ స్థానంలో కొనసాగుతుండగా.. పుజారా ఓ స్థానం మెరుగుపర్చుకుని 25వ స్థానానికి, శ్రేయస్ అయ్యర్ 10 స్థానాలు కోల్పోయి 27కు, మయాంక్ అగర్వాల్ ఓ స్థానం కోల్పోయి 28కి, కేఎల్ రాహుల్ 7 స్థానాలు కోల్పోయి 58వ ప్లేస్‌కు పడిపోయారు.
బౌలింగ్ విభాగంలో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ (866).. పాట్ కమిన్స్‌ను వెనక్కునెట్టి అగ్రస్థానానికి చేరుకోగా.. అశ్విన్ (864) ఓ ప్లేస్ మెరుగుపర్చుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు. ఆసీస్‌తో టెస్ట్ సిరీస్ ఆడనప్పటికీ బుమ్రా 5వ స్థానాన్ని కాపాడుకోగా.. జడేజా (763) 6 స్థానాలు మెరుగుపర్చుకుని 9వ స్థానానికి ఎగబాకాడు.
ఆల్‌రౌండర్ల విభాగంలో టీమిండియా ఆటగాళ్లు ఆల్‌టైమ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ కనబర్చారు. 460 రేటింగ్ పాయింట్లతో జడ్డూ భాయ్, 376 పాయింట్లతో అశ్విన్ తొలి రెండు స్థానాలను నిలబెట్టుకోగా.. అక్షర్ పటేల్ 2 స్థానాలు మెరుపర్చుకుని 5వ స్థానానికి చేరాడు.
Comments
Please login to add a commentAdd a comment