గేల్ గతంలోనూ...
♦ మహిళతో అసభ్య ప్రవర్తన
సిడ్నీ: మహిళా కామెంటేటర్‌తో అభ్యంతరకరంగా ప్రవర్తించి వార్తల్లోకెక్కిన క్రికెటర్ క్రిస్ గేల్‌కు సంబంధించి మరో వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ సందర్భంగా జరిగిన ఈ ఘటనను ఒక మహిళ ‘ఫెయిర్ ఫ్యాక్స్ మీడియా’ ముందు బయట పెట్టింది. వెస్టిండీస్ టీమ్ సహాయకారిక సిబ్బందిగా ఉన్న ఆ మహిళ... స్నాక్స్ కోసం జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లింది. వాస్తవానికి అది ప్రాక్టీస్ సమయం కావడంతో ఆటగాళ్లంతా మైదానంలోనే ఉంటారని ఆమె భావించింది. కానీ గేల్‌తో పాటు మరో క్రికెటర్ అక్కడే ఉన్నారు. ఈ సమయంలో టవల్‌తో ఉన్న గేల్ దానిని కూడా కాస్త తప్పించి ‘దీని కోసమే వెతుకుతున్నావా’ అని వ్యాఖ్యానించాడు. దాంతో బెదిరిపోయిన ఆ మహిళ నాడు ఎవరికీ దీని గురించి చెప్పుకోలేదు.
ఇప్పుడు మరో ఘటన జరగడంతో తాను ధైర్యంగా ముందుకు వచ్చానని ఆమె చెప్పింది. గత కొన్నాళ్లుగా కాలమ్స్ రాసేందుకు ఫెయిర్ ఫ్యాక్స్ మీడియా గేల్‌కు భారీ మొత్తం చెల్లిస్తోంది. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్‌ను మీడియా సంస్థ రద్దు చేసుకుంది. మరో వైపు కామెంటేటర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్టు గేల్‌కు 7 వేల డాలర్ల జరిమానా విధించింది. ఆ అమ్మాయికి గేల్ క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.