'క్రిస్ గేల్ నన్ను లైంగికంగా వేధించాడు'
ఇప్పటికే పీకల్లోతు వివాదాల్లో కూరుకుపోయిన వెస్టిండిస్ క్రికెటర్ క్రిస్ గేల్‌కు మరో షాక్ ఎదురైంది. ఆయన తనను లైంగికంగా వేధించాడంటూ ఓ ఆస్ట్రేలియా మహిళ వెల్లడించింది. 2015 వరల్డ్ కప్ సమయంలో వెస్టిండిస్ జట్టుతో కలిసి పనిచేస్తున్న తన పట్ల గేల్ చాలా అభ్యంతరకరంగా వ్యవహరించాడని ఆమె చెప్పింది.
'శాండ్‌విచ్ తీసుకొనేందుకు నేను టీమ్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాను. అక్కడ నాకు గేల్ ఎదురయ్యాడు. అతను టవల్ మాత్రమే కట్టుకొని ఉన్నాడు. వెంటనే అతను టవల్ కూడా తీసేసి.. అభ్యంతరకరంగా మాట్లాడాడు. అతన్ని చూసి షాక్ తిన్నాను. మరుక్షణంలో అక్కడి నుంచి బయటకు వచ్చేశాను' అని ఆమె ఫెయిర్‌ఫాక్స్ మీడియా సంస్థకు తన అనుభవాన్ని వివరించింది. ఈ ఘటన గురించి వెస్టిండిస్ జట్టు మేనేజర్, మాజీ కెప్టెన్ రిచీ రిచర్డ్‌సన్‌కు వివరించగా.. మహిళా సిబ్బందితో ఆటగాళ్లు గౌరవప్రదంగా వ్యవహరించాలంటూ సర్క్యులర్ జారీచేశారని, కానీ అందులో గేల్ పేరు ప్రస్తావించలేదని ఆమె తెలిపారు.
గేల్ ఇప్పటికే ఓ క్రికెట్ ప్రజెంటర్‌తో అసభ్యంగా మాట్లాడి పీకల్లోతు వివాదాల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. మహిళా ప్రజెంటర్ అయిన మెల్ మెక్‌లాలిన్‌ను తాగడానికి నాతో పాటు వస్తావా అంటూ గేల్ అంటూ ప్రత్యక్ష ప్రసారంలో అడగడం తీవ్ర దుమారం సృష్టిస్తోంది.