మిథాలీ రాజ్‌కు రూ.కోటి నజరానా
►హైదరాబాద్ బంజారాహిల్స్‌లో 600 గజాల నివాస స్థలం
►ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన
హైదరాబాద్: మహిళల వన్డే క్రికెట్ ప్రపంచకప్‌లో భారత జట్టును ఫైనల్‌కు చేర్చినందుకు, వ్యక్తిగతంగా అత్యధిక పరుగుల రికార్డు సృష్టించినందుకు కెప్టెన్ మిథాలీ రాజ్‌ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభినందించారు. మిథాలీకి ప్రభుత్వం తరఫున రూ.కోటి నగదు ప్రోత్సాహం ప్రకటించారు. అలాగే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో 600 గజాలకు తక్కువ కాకుండా నివాస స్థలాన్ని ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. మిథాలీ కోచ్ మూర్తికి రూ.25 లక్షల నగదు ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న మిథాలీ... ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రిని కలిశారు.
ఈ సందర్భంగా మిథాలీతోపాటు ఆమె కోచ్ ఆర్.ఎస్.ఆర్. మూర్తిని కేసీఆర్ శాలువా కప్పి సన్మానించారు. ‘ప్రపంచ కప్‌లో అద్భుతంగా ఆడారు. ఫైనల్ దాకా వచ్చారు. ఫైనల్లో కూడా గెలవడం ఖాయం అనుకున్నాం. దురదృష్టవశాత్తూ కొద్ది తేడాతో ఓడిపోయాం. అయినప్పటికీ మీ జట్టంతా అద్భుతంగా ఆడింది. దేశమంతా మీ ఆట చూసింది. నేనూ చూశాను. అంతా మీకు మద్దతుగా నిలిచారు. నువ్వు ఈ టోర్నీలో బాగా ఆడావు. అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన రికార్డును సొంతం చేసుకున్నావు. అద్భుత ప్రతిభ కనబరిచావు. తెలంగాణ రాష్ట్రానికి నువ్వు గర్వకారణం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి.
వ్యక్తిగతంగా నా తరఫున, తెలంగాణ ప్రజల తరఫున అభినందనలు. నీకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని మిథాలీతో కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మిథాలీరాజ్ తల్లిదండ్రులు లీలారాజ్, దొరై రాజ్, డీజీపీ అనురాగ్ శర్మ, సీపీ మహేందర్ రెడ్డి, అదనపు డీజీ అంజనీ కుమార్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, శాట్స్ ఎండీ దినకర్ బాబు, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహారాష్ట్ర సర్కార్ కూడా..
ముంబై: మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రపంచకప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తమ రాష్ట్ర క్రీడాకారిణులు స్మృతి మంధన, పూనమ్ రౌత్, మోనా మేశ్రమ్‌లకు రూ. 50 లక్షల చొప్పున నగదు పురస్కారం ప్రకటించింది.