న్యూఢిల్లీ : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), సుప్రీంకోర్టు నియమిత క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) మధ్య మరో వివాదం. మాజీ ‘కాగ్’ వినోద్ రాయ్ ఆధ్వర్యంలోని సీఓఏ... బీసీసీఐ తాత్కాలిక అధ్యక్ష, కార్యదర్శులు సీకే ఖన్నా, అమితాబ్ చౌదరి, కోశాధికారి అనిరుధ్ చౌదరిల నిర్ణయాధికారాలపై కత్తెర వేసింది. ఇప్పటికే సుప్రీంకోర్టుకు గత వారం సమర్పించిన ఏడో స్థాయీ నివేదికలో వీరి గురించి ప్రస్తావించని సీఓఏ... తాజాగా జస్టిస్ లోధా కమిటీ సిఫార్సుల అమలు విషయమై కేసుల్లో న్యాయ సాయం పొందేందుకు బోర్డు అధికారులు ఇకపై బీసీసీఐ నిధులను వినియోగించుకోకుండా కూడా ఆదేశాలిచ్చింది. అధికారులు ప్రయాణ, నివాస భత్యాలకు సైతం తమ అనుమతి కోరాలని స్పష్టం చేసింది. నెలలో 25 రోజుల పాటు విమాన ప్రయాణాల్లో ఉంటూ స్టార్ హోటళ్లలో బస చేసే అమితాబ్ చౌదరిపైనే ఈ నిర్ణయం ఎక్కువ ప్రభావం చూపనుంది.
‘అన్ని కాంట్రాక్టులు, నియామకాలపై బీసీసీఐ తరఫున బోర్డు తాత్కాలిక కార్యదర్శి సంతకం చేయొచ్చు. అయితే... సీఓఏ అంగీకరించిన వీటిపై నిర్ణీత గడువు ఐదు రోజుల్లోగా కార్యదర్శి స్పందించకుంటే సీఈవో ఆమోదంతో ముందుకెళ్తాం. ఆ నిర్ణయాలే అమలవుతాయి. ఉద్యోగులు, లబ్ధిదారులు, సర్వీస్ ప్రొవైడర్ల విషయంలో పరిపాలకుల కమిటీకి సంబంధించిన చర్చలు, సమాచారం తదితరాలన్నీ గోప్యంగా ఉంచాలి. వెల్లడించాల్సి వచ్చినా లిఖితపూర్వక అనుమతి పొందాలి’ అని సీఓఏ తమ ఆదేశాల్లో పేర్కొంది. వీటిపై బీసీసీఐ అధికారి ఒకరు తీవ్రంగా మండిపడ్డారు. ‘పాలనా వ్యవహారాలకు సంబంధించిన నియమాలను సీఓఏ పక్కకుపెట్టాలని చూస్తోంది. అందుకే బీసీసీఐ అధికారాలను లాగేసుకుంది. ఇటీవల క్రికెటర్ల వార్షిక కాంట్రాక్టుల ఖరారు సందర్భంగా కూడా మమ్మల్ని పరిగణనలోకి తీసుకోలేదు. ప్రజలు గుడ్డిగా సంతకాలు పెట్టి అనుసరించాలని భావిస్తోంది. నిర్ణయాలు తీసుకునే ముందు అనుమతి కోరాలని షరతు విధించడం జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా వెంకటేశ్ ప్రసాద్ స్థానంలో మరొకరిని నియమించాలన్న సీకే ఖన్నా ఆలోచనను అడ్డుకోవడమే దీని ఉద్దేశంగా కనిపిస్తోంది’ అని ఆ అధికారి మండిపడ్డారు.
Published Fri, Mar 16 2018 2:17 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment