
పట్టర పసిడి హైస్సా...
భారత రెజ్లర్లకు మరో రెండు స్వర్ణాలు
ఒక రజతం, ఓ కాంస్యం కూడా
తొలి రోజు లభించిన ‘పసిడి’ పట్టును రెండో రోజు నిలుపుకోవడంలో విఫలమైన భారత రెజ్లర్లు ఆఖరి రోజు మాత్రం దుమ్ముదులిపారు. ఉడుంపట్టుతో కనక వర్షం కురిపించారు. ఈసారి గేమ్స్‌లో పోటీ పడిన ప్రతి విభాగంలో ఏదో ఓ పతకం సాధించి భవిష్యత్‌పై ఆశలను రేకెత్తించారు.
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో తన ట్రేడ్ మార్క్ ‘ఫిటిల్’ (లెగ్ ట్విస్టింగ్) టెక్నిక్‌తో అలరించిన ఒలింపిక్స్ కాంస్య పతక విజేత యోగేశ్వర్ దత్‌తో పాటు బబిత కుమారి ఫైనల్లోనూ ‘పసిడి’ పట్టును నిలుపుకున్నారు. పురుషుల 65 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో యోగేశ్వర్ 10-0తో జీవోన్ బాల్‌ఫోర్ (కెనడా)పై గెలిస్తే... మహిళల 55 కేజీల కేటగిరీలో బబిత 9-2తో బ్రిటాని లావెర్డుర్ (కెనడా)ను ఓడించి స్వర్ణాలను కైవసం చేసుకున్నారు. అయితే మహిళల 63 కేజీల విభాగంలో గీతికా జకార్ రజతంతో సరిపెట్టుకుంది.
ఏకపక్షంగా సాగిన ఈ బౌట్‌లో గీతికా 0-7తో డానియెల్లి లాపాగే (కెనడా) చేతిలో ఓడింది. రెండుసార్లు రిఫరీ నుంచి హెచ్చరికలు ఎదుర్కొన్న భారత రెజ్లర్ టెక్నికల్ పాయింట్లు సంపాదించడంలో విఫలమైంది. పురుషుల 86 కేజీల కాంస్య పతక పోరులో పవన్ కుమార్ విజేతగా నిలిచాడు. మహ్మద్ ఇనామ్ (పాకిస్థాన్) జరిగిన బౌట్‌లో ఇద్దరు రెజ్లర్లు చెరో 6 పాయింట్లతో సమంగా నిలిచారు. అయితే పవన్ ఒక టెక్నికల్ పాయింట్‌తో కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా గురువారంతో ముగిసిన రెజ్లింగ్‌లో భారత్ 5 స్వర్ణాలు, 6 రజతాలు, రెండు కాంస్యాలు గెలిచింది.
1 నిమిషం 53 సెకన్లలోనే...
బాల్‌ఫోర్‌తో జరిగిన బౌట్‌లో యోగేశ్వర్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. ఆరంభంలోనే పట్టు దొరికించుకుని 1:53 సెకన్లలోనే ప్రత్యర్థిని పడగొట్టాడు. తొలి రౌండ్‌లోనే బాల్‌ఫోర్‌ను కిందపడేసిన యోగేశ్వర్ పట్టు జారకుండా జాగ్రత్తపడటంతో చకచకా 10 పాయింట్లు వచ్చాయి. దీంతో రెండో రౌండ్ లేకుండా బౌట్‌ను నిలిపేయడంతో భారత రెజ్లర్ పసిడిని సొంతం చేసుకున్నాడు. లావెర్డుర్‌తో జరిగిన బౌట్‌లో బబితా పాయింట్ల వర్షం కురిపించింది. తొలి రౌండ్‌లోనే ఐదు పాయింట్లు నెగ్గిన ఆమె రెండో రౌండ్‌లో 4 పాయింట్లు గెలిచింది. ప్రత్యర్థి కేవలం రెండు
పాయింట్లతోనే సరిపెట్టుకుంది.
కామన్వెల్త్‌లో భారత్ రౌండప్
బ్యాడ్మింటన్
క్వార్టర్స్‌లో కశ్యప్
బ్యాడ్మింటన్ వ్యక్తిగత విభాగాల్లో భారత షట్లర్లు దూసుకెళ్తున్నారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్‌ఫైనల్లో పారుపల్లి కశ్యప్ 21-7, 21-8తో జెఫ్ తో (ఆస్ట్రేలియా)పై , గురుసాయిదత్ 21-13, 21-9తో ఆండ్రూ డిసౌజా (కెనడా)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరుకున్నారు. శ్రీకాంత్ కూడా ముందంజ వేశాడు. మహిళల సింగిల్స్‌లో పి.సి.తులసి, మహిళల డబుల్స్‌లో జ్వాల-అశ్విని జోడి క్వార్టర్స్‌కు చేరారు.
బాక్సింగ్
విజేందర్‌కు పతకం ఖాయం
కామన్వెల్త్ బాక్సింగ్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన మిడిల్ వెయిట్ (75 కేజీలు) విభాగంలో క్వార్టర్‌ఫైనల్లో విజేందర్ 3-0తో ఆరోన్ ప్రిన్స్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో)పై విజయం సాధించి సెమీస్‌లోకి ప్రవేశించాడు. కాబట్టి కనీసం కాంస్య పతకమైనా దక్కుతుంది
టేబుల్ టెన్నిస్
సెమీస్‌లో శరత్ జోడి
పురుషుల డబుల్స్‌లో భారత జోడి శరత్ కమల్-ఆంథోని అమల్‌రాజ్ సెమీఫైనల్‌కు చేరుకున్నారు. క్వార్టర్ ఫైనల్లో శరత్-ఆంథోని జంట 12-10, 11-6, 7-11, 11-8తో ఇంగ్లండ్‌కు చెందిన డానీ రీడ్-శామ్ వాకర్ ద్వయంపై గెలుపొందింది. అయితే మరో పురుషుల డబుల్స్ జోడి హర్మీత్ దేశాయ్-సౌమ్యజిత్ ఘోష్ క్వార్టర్స్‌లో సింగపూర్ జంట చేతిలో ఓటమిపాలైంది. ఇక మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ శరత్ కమల్- షామిని కుమరేశన్ జోడి క్వార్టర్స్‌లో ఓడిపోయింది. మహిళల సింగిల్స్‌లో పతకంపై ఆశలున్న మానికా బాత్రా కూడా క్వార్టర్స్‌లో ఓడింది.
స్వర్ణ ‘వికాసం
పురుషుల డిస్కస్ త్రోలో భారత అథ్లెట్ వికాస్ గౌడ స్వర్ణం గెలిచాడు. గురువారం రాత్రి జరిగిన ఫైనల్లో అతను డిస్క్‌ను 63.64 మీటర్ల దూరం విసిరాడు. తొలి ప్రయత్నంలో 60.63 మీటర్లు మాత్రమే విసిరిన వికాస్ క్రమంగా దూరాన్ని పెంచాడు. రెండో ప్రయత్నంలో 62.09 మీటర్లు, మూడో ప్రయత్నంలో 63.64 మీటర్లు నమోదు చేశాడు. తర్వాతి మూడు ప్రయత్నాల్లో కాస్త నిరాశపరిచినా... 63.64 మీటర్లకు స్వర్ణం దక్కింది. అపోస్టోలస్ పారెల్లిస్ (సైప్రస్-63.32 మీటర్లు), జాసన్ మోర్గాన్ (జమైకా-62.34 మీటర్లు) వరుసగా రజతం, కాంస్య పతకాలను దక్కించుకున్నారు. మహిళల 800 మీటర్ల పరుగులో టింటూ లుకా ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయింది. సెమీస్‌లో ఆమె 2:03.35 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఏడో స్థానంలో నిలిచింది.