
గో...గో...గ్లాస్గో
నేటి నుంచి కామన్వెల్త్ గేమ్స్
చిరుతను మించిన వేగంతో పరిగెత్తే అథ్లెట్లు... ప్రత్యర్థిని ఉడుంపట్టు పట్టే రెజ్లర్లు... ఒక్క పంచ్‌తో చుక్కలు చూపించే బాక్సర్లు... ఇక 12 రోజుల పాటు కావలసినంత క్రీడల వినోదం. ఒలింపిక్స్, ఆసియా క్రీడల తర్వాత ప్రతిష్టాత్మకంగా జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు రంగం సిద్ధమైంది.
రాణిగారి ఆటలుగా ముద్రపడ్డ ఈ క్రీడలకు నేడు స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో తెరలేవనుంది. బుధవారం ప్రారంభోత్సవం జరుగుతుంది. గురువారం నుంచి ఆటలు మొదలవుతాయి. ఆగస్టు 3 వరకు ఈ సంబరం కొనసాగుతుంది. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన భారత్... ఈసారి కూడా భారీ బృందంతోనే బరిలోకి దిగుతోంది.
గ్లాస్గో: ప్రపంచంలో మూడో అతిపెద్ద క్రీడా పండుగ ‘కామన్వెల్త్ గేమ్స్’కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి 12 రోజుల పాటు జరగనున్న ఈ మెగా ఈవెంట్‌లో కామన్వెల్త్ దేశాలకు చెందిన మేటి అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు. గతంలో రెండుసార్లు ఈ పోటీలకు వేదికైన స్కాట్లాండ్ ముచ్చటగా మూడోసారి ఆతిథ్యమిస్తోంది. 1970, 1986లో ఎడిన్‌బర్గ్‌లో పోటీలు జరిగాయి. మొత్తం పోటీలను కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య (సీజీఎఫ్) పర్యవేక్షిస్తుంది.
మెరిసిపోతున్న గ్లాస్గో
అబుజా (నైజీరియా), హలిఫాక్స్ (కెనడా)ల నుంచి గట్టిపోటీ తట్టుకుని కామన్వెల్త్ బిడ్‌ను గ్లాస్గో దక్కించుకోవడంతో నిర్వాహకులు ఈ పోటీలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అథ్లెట్లకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేటి అర్ధరాత్రి సెల్టిక్ పార్క్‌లో ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఆగస్టు 3న జరిగే ముగింపు వేడుకకు హంప్డెన్ పార్క్ ఆతిథ్యమిస్తుంది. స్కాట్లాండ్ జాతీయ ఫుట్‌బాల్ స్టేడియమైన ఈ పార్క్ సీటింగ్ సామర్థ్యం 52, 025. ఈ స్టేడియంలోనే అథ్లెటిక్స్ పోటీలు జరగనున్నాయి.
గ్లాస్గోకు బిడ్‌ను కేటాయించే సమయానికి దాదాపు 70 శాతం వేదికలను పూర్తి చేశారు. పోటీలు జరిగే ప్రదేశాలను మూడు ప్రాంతాలుగా విడగొట్టారు. ఈస్ట్ ఎండ్ క్లస్టర్ మొత్తం క్రీడా గ్రామానికి కేటాయించారు. 6500 మంది అథ్లెట్స్, 2500 మంది అధికారులు ఇందులో బస చేస్తారు. ఇక్కడి నుంచి సెల్టిక్ పార్క్‌లోని ఎమిరేట్స్ ఎరెనాకు ప్రత్యేకంగా రోడ్‌ను నిర్మించారు. బాడ్మింటన్, ట్రాక్ సైక్లింగ్ పోటీలు ఇక్కడ జరుగుతాయి.
గ్లాస్గో గ్రీన్‌లో మారథాన్, హాకీ, రోడ్ సైక్లింగ్ రేస్ పోటీలను నిర్వహిస్తారు. టోలోక్రాస్ అక్వాటిక్ సెంటర్ స్విమ్మింగ్ పోటీలకు ఆతిథ్యమిస్తుంది. దీని సామర్థ్యం 5 వేల మంది. ఈసారి మొత్తం 17 విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. గతంలో 2010లో ఢిల్లీలో నిర్వహించిన వాటిలో ఆర్చరీ, టెన్నిస్, వాకింగ్, సింక్రనైజ్డ్ స్విమ్మింగ్, గ్రీకో రోమన్ రెజ్లింగ్‌లను పోటీల నుంచి తప్పించారు. ట్రయథ్లాన్ మిక్స్‌డ్ రిలే ఈవెంట్‌తో పాటు మహిళల బాక్సింగ్‌ను అదనంగా చేర్చారు.
మస్కట్ ‘క్లైడ్’
గ్లాస్గో మధ్య నుంచి పారే నది పేరు ‘క్లైడ్’. గేమ్స్ అధికారిక మస్కట్‌కు ఈ పేరు పెట్టారు. స్కాట్లాండ్‌లో మూడో అతి పెద్దదైన ఈ నది గ్లాస్గోలోని పెద్ద పట్టణాలను కలుపుతూ పారుతుంది. ఇప్పటి వరకు గేమ్స్‌కు సంబంధించి 11 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడు పోయాయి. ఇంకా పెద్ద మొత్తంలో టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రత్యేక ఆకర్షణ బోల్ట్
ఈసారి గేమ్స్‌లో జమైకా మేటి అథ్లెట్ ఉసేన్ బోల్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. 4ఁ100 రిలేలో అతను సత్తా చూపనున్నాడు. లాంగ్ డిస్టెన్స్ రన్నర్ మో ఫరా, డేవిడ్ రుడిషా, సైక్లిస్ట్ సర్ బ్రాడ్లీ విగ్గిన్స్, వేల్ష్ సైక్లిస్ట్ గెరాంట్ థామస్, స్విమ్మర్ మైకేల్ జెమీసన్, ఆస్ట్రేలియాకు చెందిన అలికా కౌట్స్, స్ప్రింటర్ కిరాణి జేమ్స్‌లాంటి మేటి అథ్లెట్స్ ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.
ఆస్ట్రేలియాదే ఆధిపత్యం
ఇప్పటి వరకు 19సార్లు జరిగిన ఈ గేమ్స్‌లో ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 12సార్లు పతకాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఇంగ్లండ్ (6 సార్లు) ఉంది. ఈసారి గేమ్స్‌లో కూడా కంగారులే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నారు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా 803 స్వర్ణ పతకాలు గెలుచుకుంది. ఓవరాల్‌గా 2 వేల పతకాలు సాధించిన దేశం కూడా ఇదే.
13 క్రీడలు జరిగే వేదికలు
17 పోటీలు జరిగే క్రీడాంశాలు. ఓవరాల్‌గా 261 పతక పోటీలు జరుగుతాయి.
71 క్రీడల్లో పాల్గొనే దేశాలు, దీవులు
213 పోటీల్లో పాల్గొనే భారత అథ్లెట్లు
1385 అథ్లెట్లకు ఇచ్చేపతకాలు
6500 పాల్గొంటున్న అథ్లెట్లు
విశేషాలు
ఈ క్రీడల కోసం 50 వేల 811 మంది వాలెంటర్లు పని చేయనున్నారు.
అథ్లెట్ల కోసం 5 లక్షల పండ్లు, 60 టన్నుల ఆలుగడ్డలు సిద్ధంగా ఉంచారు.
క్రీడా గ్రామం విస్తీర్ణం 35 హెక్టార్లు. 54 ఫుట్‌బాల్ మైదానాలకు ఇది సమానం.
840 షటిల్‌కాక్స్‌ను బాడ్మింటన్ పోటీల్లో వాడనున్నారు.
ఆరు క్రీడల కోసం 3వేల బంతులను ఉపయోగిస్తున్నారు.
అంతర్జాతీయ అథ్లెటిక్స్ ప్రమాణాలకు అనుగుణంగా హంప్డెన్ పార్క్ ఉపరితలాన్ని 1.9 మీటర్ల
ఎత్తుకు పెంచారు.
ఒరిజినల్ కామన్వెల్త్ గేమ్స్‌లో 11 దేశాల నుంచి 400 మంది అథ్లెట్లు మాత్రమే పాల్గొన్నారు.
కామన్వెల్త్ గేమ్స్‌లో 10 కోర్ స్పోర్ట్స్ ఉంటే, మిగతా వాటిని ఆతిథ్య దేశం ఎంపిక చేస్తుంది.
క్వీన్స్ బ్యాటన్ 288 రోజుల పాటు 1 లక్షా 18 వేల మైళ్లు ప్రయాణించింది.
1958లో కార్డిఫ్ గేమ్స్‌లో తొలిసారి క్వీన్స్ బ్యాటన్‌ను ప్రవేశపెట్టారు.
చేపల పోటీలతో మొదలు..
పూర్వకాలంలో బ్రిటిష్ రాజుల మధ్య సరదాగా జరిగే చేపల పోటీలు కాల క్రమంలో కామన్వెల్త్ గేమ్స్‌కు దారితీశాయి. 1891లో జాన్ ఆష్లే కూపర్ నాలుగేళ్లకొకసారి క్రీడల పండుగలు నిర్వహిస్తే బాగుంటుందని చేసిన ప్రతిపాదనతో వీటికి బీజం పడింది. బ్రిటిష్ రాజుల మధ్య అవగాహన పెంపొందించుకోవడంతో పాటు సౌభ్రాతృత్వాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ఈ క్రీడలను వేదికగా చేసుకున్నారు. 1911 లండన్ క్రిస్టల్ ప్యాలెస్‌లో జరిగిన కింగ్ జార్జ్ పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా నిర్వహించిన ఇంటర్ ఎంపైర్ చాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణాఫ్రికా, యూకేలు మాత్రమే బరిలోకి దిగాయి. బాక్సింగ్, రెజ్లింగ్, స్విమ్మింగ్, అథ్లెటిక్స్‌లో పోటీలు జరిగాయి.
1930లో ఒంటారియోలోని హామిల్టన్‌లో తొలిసారి బ్రిటిష్ ఎంపైర్ పోటీలను ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో మహిళలు కేవలం స్విమ్మింగ్‌కు మాత్రమే పరిమితమయ్యారు. 1934 నుంచి కొన్ని అథ్లెటిక్స్ ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు అనుమతి లభించింది. 1954 నుంచి 1966 వరకు బ్రిటిష్ అంపైర్ అండ్ కామన్వెల్త్ గేమ్స్‌గా, 1970 నుంచి 1974 వరకు బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్‌గా నిర్వహించారు. 1978 నుంచి కామన్వెల్త్ గేమ్స్ పేరుతో పోటీలు జరుగుతున్నాయి.
అందగత్తె బరువులెత్తుతోంది
సాధారణంగా అందగత్తెలు మోడలింగ్‌ని కెరీర్‌గా ఎంచుకుంటారు.. మూడు స్టేజ్ షోలు.. ఆరు క్యాట్ వాక్‌లతో ఈ రంగంలో దూసుకుపోతారు. కానీ.. ఇంగ్లండ్‌కు చెందిన 21 ఏళ్ల బ్యూటీ క్వీన్ సారా డేవిస్ మోడలింగ్‌ను వదులుకుని, మహిళలు అంతగా ఇష్టపడని వెయిట్ లిఫ్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది.
సారా త్యాగానికి కారణం ఆమె ప్రియుడు జాక్ ఒలివర్. ఇంగ్లండ్ తరఫున వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటుతుండటంతో అతన్ని స్ఫూర్తిగా తీసుకుని... ఈ క్రీడలోకి అడుగుపెట్టింది. అనతికాలంలోనే సత్తా చాటిన సారా ప్రస్తుతం గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో ఇంగ్లండ్ తరఫున బరిలోకి దిగుతోంది. ఆమె ప్రియుడు కూడా ఈ పోటీల్లో పాల్గొంటున్నాడు. ఈ చిన్నది ఇప్పుడు ‘స్ట్రాంగ్ ఈజ్ ద న్యూ సెక్సీ’ అంటూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ బ్యూటీ 2012లో మిస్ లీడ్స్‌గా ఎంపికైంది. ప్రస్తుతం ఓ స్కూల్లో పీఈటీగా పనిచేస్తోంది.
ప్రధాని శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనబోతున్న భారత అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోడి శుభాకాంక్షలు తెలిపారు. ‘గ్లాస్గో గేమ్స్‌లో బరిలోకి దిగుతున్న క్రీడాకారులకు అభినందనలు తెలుపుతున్నాను. వారు మన దేశం గర్వపడేలా ఆడతారని భావిస్తున్నాను. కామన్వెల్త్ లాంటి ఈవెంట్స్‌లో పోటీపడి క్రీడాకారులు పేరు ప్రఖ్యాతులు సాధించడమే కాకుండా... ఈ గేమ్స్ దేశాల మధ్య సమైక్యత, సౌభ్రాతృత్వం నెలకొల్పేందుకు తోడ్పడతాయి’ అని మోడి అన్నారు.
‘సౌకర్యాలు దారుణం’
గత కామన్వెల్త్ గేమ్స్ లో ఢిల్లీలో ఏర్పాటు చేసిన సౌకర్యాలతో పోలిస్తే ఇక్కడి గేమ్స్ విలేజి పరిస్థితి దారుణంగా ఉందని భారత చెఫ్ డి మిషన్ రాజ్ సింగ్ ఆరోపించారు. అప్పట్లో పరిశుభ్రత, సౌకర్యాలు లేవని చాలా దేశాలు తమను విమర్శించినా గ్లాస్గోలో పరిస్థితులు అంతకన్నా తక్కువ స్థాయిలోనే ఉన్నాయని చెప్పారు. ‘ఇక్కడి విలేజి చాలా తక్కువ విస్తీర్ణంలో కట్టారు. చాలీచాలని బాత్‌రూమ్స్‌తో పాటు తక్కు వ టీవీ సెట్స్‌తో ఇబ్బందిపడుతున్నాం. ఇక్కడితో పోల్చుకుంటే 2010లో ఢిల్లీలో గొప్ప సౌకర్యాలు అందించాం’ అని రాజ్ సింగ్ పేర్కొన్నారు.