పోటాపోటీగా పతకాల వేట | Competing in the medal hunt | Sakshi
Sakshi News home page

పోటాపోటీగా పతకాల వేట

Published Wed, Aug 10 2016 1:25 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

పోటాపోటీగా   పతకాల వేట

పోటాపోటీగా పతకాల వేట

తొలి రోజే పసిడి వేటను మొదలుపెట్టిన అమెరికా రియో ఒలింపిక్స్‌లో తన జోరును కొనసాగిస్తోంది. ఈత కొలనులో బంగారు చేపలా దూసుకెళ్తూ స్వర్ణ కాంతులు విరజిమ్ముతోంది. అయితే అగ్రరాజ్యానికి దీటైన సమాధానమిస్తూ చైనా కూడా సత్తా చాటుకుంటోంది. అమెరికాతో సమానంగా ఐదు స్వర్ణాలు సాధించి టాప్ ర్యాంక్ కోసం పోటీపడుతోంది. ఇప్పటివరకు 15 దేశాలు కనీసం ఒక స్వర్ణం సాధించగా... మొత్తం 34 దేశాలకు కనీసం ఒక కాంస్యమైనా దక్కింది.


రియో డి జనీరో: ఈత కొలనులో తమకు ఎదురులేదని అమెరికా స్విమ్మర్లు నిరూపిస్తున్నారు. తమ ఖాతాలో మరో రెండు స్వర్ణాలు చేర్చుకున్నారు. మంగళవారం జరిగిన పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో రియాన్ మర్ఫీ... మహిళల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ విభాగంలో లిలియా కింగ్ పసిడి పతకాలు గెల్చుకున్నారు. ఫైనల్ రేసును రియాన్ మర్ఫీ 51.97 సెకన్లలో ముగించి కొత్త ఒలింపిక్ రికార్డు నెలకొల్పాడు. లిలియా కింగ్ ఒక నిమిషం 04.93 సెకన్లలో లక్ష్యానికి చేరి విజేతగా నిలిచింది. మరోవైపు చైనాకు డైవింగ్‌లో, స్విమ్మింగ్‌లో ఒక్కో స్వర్ణం దక్కింది. పురుషుల సింక్రనైజ్డ్ 10 మీటర్ల ప్లాట్‌ఫామ్ ఈవెంట్‌లో లిన్-చెన్ ద్వయం చైనాకు పసిడి అందించింది. 200 మీటర్ల ఫ్రీస్టయిల్ ఫైనల్ రేసులో సన్ యాంగ్ ఒక నిమిషం 44.65 సెకన్లలో గమ్యానికి చేరి బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు.

 
బ్రెజిల్ పసిడి బోణీ

ఒలింపిక్స్ మొదలైన మూడు రోజులకు ఆతిథ్య దేశం బ్రెజిల్ పసిడి బోణీ చేసింది. మహిళల జూడో 57 కేజీల విభాగంలో రాఫెలా సిల్వా విజేతగా నిలిచి బ్రెజిల్‌కు తొలి స్వర్ణాన్ని అందించింది. ఫైనల్లో సుమియా (మంగోలియా)పై రాఫెలా గెలిచింది.

 
కటింకా... రెండోసారి...

గత మూడు ఒలింపిక్స్‌లలో రిక్తహస్తాలతో వెనుదిరిగిన హంగేరి స్టార్ స్విమ్మర్ కటింకా హొసజు రియో ఒలింపిక్స్‌లో మాత్రం గొప్ప ఫామ్‌లో ఉంది. ఇప్పటికే 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో స్వర్ణం నెగ్గిన కటింకా... 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లోనూ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. తన భర్త షేన్ టసఫ్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్న కటింకా ఫైనల్ రేసును 58.45 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది. కటింకా మరో మూడు ఈవెంట్స్‌లో పోటీ పడాల్సి ఉంది.

 
జిమ్నాస్టిక్స్‌లో జపాన్ పైచేయి

లండన్, బీజింగ్ ఒలింపిక్స్‌లో పురుషుల ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ టీమ్ ఈవెంట్‌లో చైనా ధాటికి రజతంతో సంతృప్తి పడిన జపాన్... రియోలో మాత్రం లెక్క సరిచేసింది. కెంజో షిరాయ్, యుసుసె తనాకా, కొజి యామమురో, ఉచిమురా, ర్యోని కటోలతో కూడిన జపాన్ బృందం 274.094 పాయింట్లు సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. రష్యా జట్టుకు (271.453 పాయింట్లు) రజతం దక్కగా... డిఫెండింగ్ చాంపియన్ చైనా కాంస్య పతకంతో (271.122 పాయింట్లు) సరిపెట్టుకుంది.

 
రగ్బీ సెవెన్స్‌లో ఆసీస్ హవా

ఒలింపిక్స్‌లో తొలిసారి చోటు దక్కించుకున్న రగ్బీ సెవెన్స్ క్రీడాంశంలో మహిళల విభాగంలో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆస్ట్రేలియా 24-17తో ప్రపంచ చాంపియన్ న్యూజిలాండ్‌పై సంచలన విజయం సాధించింది. ఈ పోటీల్లో ఆస్ట్రేలియా మొత్తం ఐదు మ్యాచ్‌ల్లో ఆడి నాలుగింటిలో గెలిచి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. కాంస్య పతక పోరులో కెనడా 33-10తో బ్రిటన్‌ను ఓడించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement