మిశ్రాపై పెట్టిన వేధింపుల కేసు ఉపసంహరణ!
బెంగళూరు: భారత్ స్పిన్నర్ అమిత్ మిశ్రాకు ఊరట లభించనుంది. ఆయనపై ఓ మహిళ పెట్టిన లైంగిక వేధింపుల కేసును ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది. తాను మిశ్రా మంచి మిత్రులమని, మున్ముందు కూడా మంచి మిత్రులుగానే కొనసాగుతామని చెప్పింది. తాను కేసు ఉపసంహరించుకోవడం వెనుక ఎలాంటి ఒత్తిడిలు లేవని, స్వచ్ఛందంగానే విత్ డ్రా చేసుకుంటున్నానని కూడా స్పష్టం చేసింది. గత సెప్టెంబర్లో బెంగళూరులోని ఓ హోటల్లో బస చేసిన అమిత్ మిశ్రాను చూసేందుకు వెళ్లిన తనను లైంగిక వేధించాడని ఓ మహిళ బెంగళూరు అశోక్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
దీంతో అతడిపై ఐపీసీ సెక్షన్లు 354, 328 కింద కేసు నమోదు చేశారు. తమముందు హాజరుకావాలని సమన్లు కూడా పంపించారు. ఈ లోగానే ఆ మహిళ స్వయంగా కేసు విత్ డ్రా చేసుకోనుండటంతో మిశ్రాకు ఉపశమనం లభించనున్నట్లయింది. 'ఫిర్యాదు చేసిన రెండు రోజుల తర్వాత నేను పోలీస్ స్టేషన్కు వెళ్లాను. కేసు ఉపసంహరించుకుంటానని చెప్పాను. మిశ్రాకోసం పోలీస్ స్టేషన్ లో ఎదురు చూస్తున్నాను. కేసు విత్ డ్రా చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మేం స్నేహితులం. పోట్లాడాం. అయినా మా స్నేహం తర్వాత కూడా కొనసాగుతుంది' అంటూ ఆ మహిళ చెప్పుకొచ్చింది.