case withdraw
-
ఏడుసార్లు అబార్షన్ అంటూ నటి ఫిర్యాదు.. అంతలోనే బిగ్ ట్విస్ట్!
ఇటీవల శాండల్‌వుడ్ విజయలక్ష్మి నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అతని వల్ల ఏడుసార్లు అబార్షన్ అయిందంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు సైతం దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే ఈ కేసు ఊహించని విధంగా మలుపులు తిరిగింది. సీమాన్‌పై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకున్నట్లు వెల్లడించింది. (ఇది చదవండి: మహేశ్ బాబు నుంచి మరో మల్టీఫ్లెక్స్ థియేటర్ రెడీ.. ఎక్కడో తెలుసా?) అయితే ఈ కేసులో ఇప్పటికే ఆమెకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. సీమాన్ పలుమార్లు అబార్షన్లు చేయించారని ఆరోపిస్తూ ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. సీమాన్ తనను వాడుకుని మోసం చేసినట్టుగా దశాబ్దం కాలంగా విజయలక్ష్మి పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో సీమాన్ పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విజయలక్ష్మి యూటర్న్ తీసుకుంది. వలసర వాక్కం పోలీసు స్టేషన్లో కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు లిఖిత పూర్వకంగా వినతిపత్రం సమర్పించారామె. దీంతో పోలీసులు సీమాన్ సూపర్.. ఓ సంస్థకు చెందిన వీరలక్ష్మి పర్యవేక్షణలో తాను గృహ నిర్భంధంలో ఉన్నట్టుగా గత కొద్ది రోజులుగా పరిణామాలు చోటు చేసుకున్నాయని విజయలక్ష్మి అన్నారు. ఇవి తనను ఎంతగానో బాధించాయని పేర్కొన్నారు. సీమాన్ సూపర్ అని.. ఆయన పవర్ ఫుల్ అని కామెంట్స్ చేశారు. ఆయన్ని ఇక్కడ ఎవ్వరూ ఏమీ చేయలేరని.. తాను మళ్లీ ఇక్కడికి రాబోనని, బెంగళూరు వెళ్లి పోతున్నట్లు విజయలక్ష్మి పేర్కొన్నారు. సీమాన్ పవర్ ముందు తాను ఓటమిని అంగీకరించి వెళ్తున్నానని అన్నారు. అతను బాగుండాలని.. రాజకీయంగా మరిన్నీ విజయాలు సాధించాలని కోరుకున్నారు. తాను సీమాన్ వద్ద ఎలాంటి నగదు, మరే ఇతర తాయిలాలు తీసుకోలేదని మరోసారి ఆమె స్పష్టం చేశారు. (ఇది చదవండి: హర్ఘసాయి హీరోగా మెగా సినిమా.. టీజర్ వచ్చేసింది) -
అపార్ట్మెంట్ న్యూసెన్స్ కేసు : నిహారిక భర్త చైతన్య క్లారిటీ
Niharika Husband Chaitanya Clarity On Case Filed: షేక్‌పేట్‌లోని అపార్ట్మెంట్ వాసులతో జరిగిన వివాదంపై నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య క్లారిటీ ఇచ్చారు. అపార్ట్మెంట్ వాసులు గొడవ చేయడం వల్లే పీఎస్‌లో ఫిర్యాదు చేశానని తెలిపిన చైతన్య.. అందరం మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకున్నట్లు తెలిపారు. అయితే ముందు తనమీదే కేసు నమోదైనట్లు వార్తలు రావడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఆగస్టు 10లోగా ఫ్లాట్ ఖాళీ చేస్తున్నట్లు ముందే ఓనర్‌కి చెప్పినట్లు పేర్కొన్నారు. 'ఫ్లాట్ తీసుకున్నప్పుడే ఆఫీస్ పర్పస్ కోసమని ఓనర్‌కి చెప్పాం, అయితే అపార్ట్మెంట్ అసోసియయేషన్‌కు క్లారిటీ లేకపోవడంతో వాదనకు దిగారు' అని చైతన్య గొడవపై వివరణ ఇచ్చారు. ఇక ఇదే విషయంపై అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీధర్ మాట్లాడుతూ.. అపార్ట్‌మెంట్‌ను నిహారిక దంపతులు కమర్షియల్‌గా వాడుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఆఫీస్ కోసమని ఫ్లాట్ తీసుకున్న విషయం తమకు తెలియదని, దీంతో వాదన జరిగినట్లు తెలిపారు. అయితే ఇప్పుడు అందరం కలిసి సమస్యను పరిష్కరించుకున్నామని వివరించారు. కాగా చైతన్య అర్ధరాత్రిపూట గొడవ చేస్తూ తమకు ఇబ్బంది కలిగిస్తున్నాడని అపార్ట్మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్న చైతన్య అక్కడే ఆఫీస్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాడట. గత కొన్ని రోజులుగా ఫ్లాట్‌కు కొంతమంది యువకులు వస్తున్నారని, వారు మద్యం తాగి నానా హంగామా సృష్టిస్తున్నట్లు అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అపార్ట్మెంట్ వాసులపై కూడా చైతన్య తిరిగి ఫిర్యాదు చేశాడు. తమ వ్యక్తిగత జీవితానికి అపార్ట్మెంట్ వాసులు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇరువురి వాదనలు విన్న పోలీసులు విచారణ జరిపి ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు.కాగా చైతన్య జొన్నలగడ్డతో నిహారిక కొణిదెల వివాహం డిసెంబర్ 9న ఉదై విలాస్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. -
తప్పుడు కేసులు దుర్మార్గ చర్య
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రేరేపకులుగా ఆరోపిస్తూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జేఎన్‌యూ ప్రొఫెసర్ జయతీ ఘోష్, మరికొందరు మేధావులపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించాలని సీపీఐ నేత సురవరం సుధాకరరెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రధాన నిందితులైన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతరుల పేర్లు, వివరాలు పత్రికల్లో వచ్చినా వారిపై చర్యలు తీసుకోకుండా సంబంధం లేని వారిపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అని, ఈ తప్పుడు కేసులు పెట్టేందుకు కేంద్ర హోంశాఖ చేస్తున్న కుట్రను ఖండిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీమాకోరేగావ్‌లో జరిగిన అల్లర్లలో పాల్గొన్న సంఘ్‌పరివార్‌కు చెందిన నిందితులను వదిలేసి, ఈ ఘటనతో సంబంధం లేని మేధావులు, వామపక్ష భావాలు కలిగిన వారిని తప్పుడు కేసులతో అరెస్ట్ చేసి రెండేళ్లు అయినా ఎఫ్ఐఆర్ దాఖలు చేయకుండా, బెయిల్ ఇవ్వకుండా వేధిస్తున్నారని విమర్శించారు. సీపీఎం అగ్రనేత ఏచూరి, మరో 8 మంది మేధావులపై బీజేపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నట్టు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. నేడు నిరసనలు.. ఢిల్లీ అల్లర్ల కేసులో ఏచూరి తదితరులపై పోలీసులు చార్జిషీటును ఫైల్ చేయడంపై సోమవారం సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, టీజేఎస్, టీటీడీపీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నాయి. ఈ అక్రమ కేసులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపడుతున్న నిరసనల్లో భాగంగా హైదరాబాద్ ఆర్టీసి క్రాస్‌రోడ్డులో చేపడుతున్న కార్యక్రమంలో ఈ పార్టీల నాయకులు పాల్గొంటారని సీపీఎం తెలిపింది. -
సీత క్షమించింది..!
సాక్షి, దొండపర్తి (విశాఖ దక్షిణ): ప్రజా సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పథకాల ద్వారా జరుగుతున్న మేలు గురించి ఓ మహిళ వివరిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏడాది వ్యవధిలో రాష్ట్రంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులు, సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రజలకు ఇంటివద్దే అందుతున్న సౌకర్యాల గురించి ప్రస్తావిస్తూ పాలనలో వ్యత్యాసాన్ని కళ్లకు కట్టినట్లు వివరించింది. అయితే.. విశాఖ జిల్లా బుచ్చెయ్యపేట మండలం కొండెంపూడికి చెందిన జనసేన సానుభూతిపరులైన ఇద్దరు యువకులు నాలుగు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారు. రావికమతం మండలం కొత్తపేట గ్రామానికి చెందిన దంట్ల నాగసీత వారిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే బీటెక్ చదువుతున్న ఆ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెద్ద మనసుతో కేసును వాపసు తీసుకోవాలని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆమెను ప్రాధేయపడ్డారు. ఆ యువకులు ఇద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు మరోసారి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయబోమని పశ్చాతాపం వ్యక్తం చేయడంతో ఆమె కేసు వాపసు తీసుకుంది. (డాక్టర్ సుధాకర్ పోలీసుల అదుపులో లేరు) -
ఆలూ రైతులపై పెప్సీ కేసులు వెనక్కి!
అహ్మదాబాద్: గుజరాత్లో బంగాళదుంపలు పండించిన రైతులపై తాము వేసిన కేసులను ఉపసంహరించుకోనున్నట్లు ఆహార, పానీయ ఉత్పత్తుల సంస్థ పెప్సీకో గురువారం ప్రకటించింది. గుజరాత్‌లోని కొంతమంది రైతులు ఎఫ్‌సీ–5 రకం బంగాళదుంపలను పండించగా, ఆ రకం బంగాళదుంపలపై తమకు పంటరకం రక్షణ హక్కులు ఉన్నాయనీ, తమ అనుమతి లేకుండా వీటిని ఎవరూ పండించకూడదంటూ పెప్సీకో మొత్త 11 మంది రైతులపై కేసు వేయడం తెలిసిందే. ఈ రకం బంగాళదుంపలను పెప్సీలో తమ లేస్ చిప్స్ తయారీకి వినియోగిస్తోంది. పెప్సీకో కేసు వేయడంతో మన దేశంలో రైతులు ఏం పండించాలో ఒక విదేశీ సంస్థ శాసించడం ఏంటంటూ విమర్శలు వెల్లువెత్తడంతో పెప్సీ తాజాగా వెనక్కి తగ్గింది. -
కేసు విత్ డ్రా చేసుకోలేదని దారుణ హత్య
గుర్గావ్ : అత్యాచార కేసును ఉపసంహరించుకునేందుకు నిరాకరించిన మహిళను దారుణంగా కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. గుర్గావ్లో శుక్రవారం ఉదయం ఘటన చోటు చేసుకుంది. కోర్టులో ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేయడానికి కొన్ని గంటలముందు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి అందించిన సమాచారం ప్రకారం నిందితుడు సందీప్ కుమార్, శుక్రవారం తెల్లవారుఝామున ఆమె ఇంటికి వెళ్లాడు. మాట్లాడాలి రమ్మని బయటికి పిలిచి, కిడ్నాప్ చేసి కారులో తీసుకు పోయాడు. అనంతరం ఆమెను తుపాకీతో కాల్చి చంపి పారిపోయాడు. గుర్గావ్-ఫరిదాబాద్ ఎక్స్‌ప్రెస్‌వే పై మృతదేహాన్ని గుర్తించిన స్తానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగు చూసింది. మృతురాలి తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారి సుభాష్ బోకన్ తెలిపారు. కాగా ఒక బార్లో డాన్సర్‌గా పనిచేస్తున్న బాధితురాలు అదే బార్లో బౌన్సర్‌గా పనిచేస్తున్న సందీప్ కుమార్‌పై మార్చి, 2017లో అత్యాచార కేసు నమోదు చేసింది. ఈ కేసులో అరెస్టయిన సందీప్ అనంతరం బెయిల్‌పై బయటికొచ్చాడు. దీనిపై విచారణ శుక్రవారం (జనవరి18) జరగాల్సి వుంది. అయితే కేసును ఉపసంహరించుకోవాలని లేదంటే చంపేస్తానని చాలాసార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు. చివరికి దారుణానికి ఒడిగట్టాడు. -
గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు విత్‌డ్రా చేసుకోండి
పరిగి: కాంగ్రెస్ పార్టీ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు విత్‌డ్రా చేసుకుంటే 15 రోజుల్లో పరిగిలో పాలమూరు ఎత్తిపోతల పనులకు టెంకాయ కొడతామని భారీ నీటిపారుదల మంత్రి టి. హరీశ్‌రావు స్పష్టం చేశారు. శనివారం మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, విద్యా మౌలిక వన రుల అభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్ నాగేందర్‌గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ కొప్పుల మహేశ్‌రెడ్డితో కలసి పరిగిలో పర్యటించారు. బీఎంఆర్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న పోటీ పరీక్షల శిక్షణ కార్యక్రమంలో మెటీరియల్ పంపి ణీ చేశారు. అనంతరం మండల పరిధిలోని లఖ్నాపూర్ ప్రాజెక్టును రూ.8.15 కోట్లతో మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చే పనులకు హరీశ్‌రావు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పరిగి ఎమ్మెల్యే ఓ టైపు మనిషి ఆయా కార్యక్రమాల్లో హరీశ్‌రావు మాట్లాడుతూ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అంతా ఓ టైపు మనిషి.. వాళ్ల పార్టీ తప్పు చేస్తే దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తారని విమర్శించారు. మీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి చెప్పి కేసు విత్‌డ్రా చేయించమనండి.. లేదంటే హర్షవర్ధన్‌రెడ్డితో తమకు సంబంధం లేదని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా మంత్రి సవాల్ విసిరారు. త్వరలో 9,600 పంచాయతీ కార్యదర్శులను కొత్త జిల్లాల వారీగా చేపడతామని తెలిపారు. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త జిల్లాలకు సంబంధించిన సవరణ ఆమోదం కోసం సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారని చెప్పారు. ఉద్యోగాల కల్పనలో తెలంగాణ రాష్ట్రం టాప్‌లో ఉందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. 16 వేల కానిస్టేబుల్, రెండు వేల ఎస్ఐ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని తెలిపారు. రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రూ.480 కోట్లతో 1,450 చెరువుల్లో మిషన్ భగీరథ పనులు చేపట్టామన్నారు. -
మిశ్రాపై పెట్టిన వేధింపుల కేసు ఉపసంహరణ!
బెంగళూరు: భారత్ స్పిన్నర్ అమిత్ మిశ్రాకు ఊరట లభించనుంది. ఆయనపై ఓ మహిళ పెట్టిన లైంగిక వేధింపుల కేసును ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది. తాను మిశ్రా మంచి మిత్రులమని, మున్ముందు కూడా మంచి మిత్రులుగానే కొనసాగుతామని చెప్పింది. తాను కేసు ఉపసంహరించుకోవడం వెనుక ఎలాంటి ఒత్తిడిలు లేవని, స్వచ్ఛందంగానే విత్ డ్రా చేసుకుంటున్నానని కూడా స్పష్టం చేసింది. గత సెప్టెంబర్‌లో బెంగళూరులోని ఓ హోటల్లో బస చేసిన అమిత్ మిశ్రాను చూసేందుకు వెళ్లిన తనను లైంగిక వేధించాడని ఓ మహిళ బెంగళూరు అశోక్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై ఐపీసీ సెక్షన్లు 354, 328 కింద కేసు నమోదు చేశారు. తమముందు హాజరుకావాలని సమన్లు కూడా పంపించారు. ఈ లోగానే ఆ మహిళ స్వయంగా కేసు విత్ డ్రా చేసుకోనుండటంతో మిశ్రాకు ఉపశమనం లభించనున్నట్లయింది. 'ఫిర్యాదు చేసిన రెండు రోజుల తర్వాత నేను పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను. కేసు ఉపసంహరించుకుంటానని చెప్పాను. మిశ్రాకోసం పోలీస్ స్టేషన్ లో ఎదురు చూస్తున్నాను. కేసు విత్ డ్రా చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మేం స్నేహితులం. పోట్లాడాం. అయినా మా స్నేహం తర్వాత కూడా కొనసాగుతుంది' అంటూ ఆ మహిళ చెప్పుకొచ్చింది. -
మోసం చేసిన మహిళపై జాలి చూపిన నటుడు అలీ..
హైదరాబాద్: హాస్యనటుడు అలీ ఔదార్యాన్ని ప్రదర్శించారు. తనను లక్షల రూపాయల మేర మోసం చేసిన ఓ మహిళపై జాలి చూపారు. ప్రస్తుతం తినడానికి తిండి కూడా లేనిస్థితిలో వృద్దాప్యంలో ఉన్న ఆమెపై కేసును వెనక్కి తీసుకున్నారు. జాతీయ లోక్‌అదాలత్ సందర్భంగా శనివారం నాంపల్లి కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో పాల్గొని ఆ వృద్ధురాలిపై కేసు ఉపసంహరించుకున్నారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన సాంబశివరావు, శకుంతల దంపతుల ఇంటిని 1998లో అలీ కొనుగోలు చేశారు. అయితే ఆ ఇంటిపై సాంబశివరావు దంపతులు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.90 లక్షల రుణం తీసుకున్నారు. ఈ సంగతి చెప్పకుండానే ఇంటిని విక్రయించారు. బ్యాంకు అధికారుల ద్వారా ఆలస్యంగా ఆ విషయాన్ని తెలుసుకున్న అలీ... 2006లో వారిద్దరిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో చీటింగ్ కేసు నమోదైంది. ప్రస్తతం నాంపల్లి నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో తుది విచారణ దశలో ఉంది. ఈ నేపథ్యంలో జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా న్యాయమూర్తి ఎస్.ఎస్.శ్రీదేవి... శకుంతల దయనీయ పరిస్థితిని అలీకి వివరించారు. దీంతో కేసును ఉపసంహరించుకునేందుకు ఆయన ముందుకొచ్చారు. లోక్ అదాలత్ లో నిందితుల నుంచి తమకు రావాల్సిన డబ్బు తీసుకొని కక్షిదారులు రాజీ అవుతుండగా..అలీ మాత్రం తనకు రావల్సిన డబ్బును వదులుకొని పెద్ద మనసుతో కేసును ఉపసంహరించుకున్నారు. ఈ విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించిన అలీని న్యాయమూర్తులు అభినందించారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మరికొందరు ముందుకొచ్చి కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు.