మోసం చేసిన మహిళపై జాలి చూపిన నటుడు అలీ..
హైదరాబాద్: హాస్యనటుడు అలీ ఔదార్యాన్ని ప్రదర్శించారు. తనను లక్షల రూపాయల మేర మోసం చేసిన ఓ మహిళపై జాలి చూపారు. ప్రస్తుతం తినడానికి తిండి కూడా లేనిస్థితిలో వృద్దాప్యంలో ఉన్న ఆమెపై కేసును వెనక్కి తీసుకున్నారు. జాతీయ లోక్అదాలత్ సందర్భంగా శనివారం నాంపల్లి కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్లో పాల్గొని ఆ వృద్ధురాలిపై కేసు ఉపసంహరించుకున్నారు.
హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన సాంబశివరావు, శకుంతల దంపతుల ఇంటిని 1998లో అలీ కొనుగోలు చేశారు. అయితే ఆ ఇంటిపై సాంబశివరావు దంపతులు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.90 లక్షల రుణం తీసుకున్నారు. ఈ సంగతి చెప్పకుండానే ఇంటిని విక్రయించారు. బ్యాంకు అధికారుల ద్వారా ఆలస్యంగా ఆ విషయాన్ని తెలుసుకున్న అలీ... 2006లో వారిద్దరిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో చీటింగ్ కేసు నమోదైంది.
ప్రస్తతం నాంపల్లి నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో తుది విచారణ దశలో ఉంది. ఈ నేపథ్యంలో జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా న్యాయమూర్తి ఎస్.ఎస్.శ్రీదేవి... శకుంతల దయనీయ పరిస్థితిని అలీకి వివరించారు. దీంతో కేసును ఉపసంహరించుకునేందుకు ఆయన ముందుకొచ్చారు.
లోక్ అదాలత్ లో నిందితుల నుంచి తమకు రావాల్సిన డబ్బు తీసుకొని కక్షిదారులు రాజీ అవుతుండగా..అలీ మాత్రం తనకు రావల్సిన డబ్బును వదులుకొని పెద్ద మనసుతో కేసును ఉపసంహరించుకున్నారు. ఈ విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించిన అలీని న్యాయమూర్తులు అభినందించారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మరికొందరు ముందుకొచ్చి కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు.